Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలులో ఈ సదుపాయాలు కూడా ఉంటాయట!

  • బుల్లెట్ రైలులో అదిరిపోయే సౌకర్యాలు
  • పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేక గదులు
  • మహిళలు, పురుషులకు వేర్వేరు వాష్‌రూములు

ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలులో కల్పించనున్న కొన్ని సౌకర్యాలకు సంబంధించి వివరాలు బయటకొచ్చాయి. వీలైనంత త్వరగా బుల్లెట్‌ రైలును ప్రజలకు పరిచయం చేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తుండగా, భూసేకరణ వివాదాలు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.

తాజాగా, ఈ రెండు నగరాల మధ్య తిరగనున్న బుల్లెట్ రైలులో ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలకు సంబంధించి మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఇందులో పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ప్రతీ బోగీలోనూ ఓ గదిని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే మహిళలు, పురుషులకు వేర్వేరుగా వాష్‌రూములు వుంటాయి. ప్రతీ రైలులో బిజినెస్ క్లాసులో 55 సీట్లు, స్టాండర్డ్ క్లాస్‌లో 695 సీట్లు ఉంటాయి. వీటితోపాటు ఫ్రీజర్, హాట్ కేస్, వేడి నీళ్లు, టీ, కాఫీ మేకర్లు కూడా ఉండనున్నాయి.  

బేబీ టాయిలెట్లతో కూడిన బేబీ చేంజింగ్ రూమ్, చిన్నారుల కోసం ప్రత్యేకంగా వాష్ బేసిన్లు, డైపర్ డిస్పోజల్స్ ఏర్పాటు చేయనున్నారు. వీల్ చైర్ ప్రయాణికుల కోసం అదనంగా విశాలవంతమైన టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. పురుషుల కోసం మౌంటెడ్ టైప్ యూరినల్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News