NMDC: ఎన్ఎండీసీకి దక్కిన చిత్తూరు బంగారం గని!

  • అదానీ, వేదాంతలతో పోటీ పడిన ఎన్ఎండీసీ
  • విక్రయ ఆదాయంలో 38.25 శాతం ప్రభుత్వానికి
  • త్వరలోనే పనులు ప్రారంభించనున్న ఎన్ఎండీసీ

చిత్తూరు జిల్లాలో ఉన్న బంగారం గని నుంచి ఖనిజాన్ని వెలికితీసే కాంట్రాక్టును ప్రభుత్వ రంగ ఎన్ఎండీసీ చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రొడక్షన్ విభాగం డైరెక్టర్ పీకే సత్పతి వెల్లడించారు. ఇండియాలో ఎన్ఎండీసీ తొలి గోల్డ్ మైన్ ను దక్కించుకుందని ఆయన అన్నారు. గని కోసం అదానీ, వేదాంత వంటి ప్రైవేటు సంస్థలు కూడా పోటీ పడ్డాయి. చివరకు ఎన్ఎండీసీ విజేతగా నిలిచింది. ఏపీ ప్రభుత్వం అధికారికంగా గనిని కేటాయించిన తరువాత, ఇక్కడ అభివృద్ధి పనులను మొదలు పెడతామని, అందుకు రూ. 450 కోట్ల మేరకు ఇన్వెస్ట్ మెంట్ అవసరమవుతుందని అంచనా వేస్తున్నామని సత్పతి పేర్కొన్నారు.

కాగా, జిల్లాలోని చిగురుగుంట - బిసనట్టం ప్రాంతంలో దాదాపు 263 హెక్టార్లలో విస్తరించి ఉన్న గనిలో 18.3 లక్షల టన్నుల ముడి ఖనిజం వనరులున్నాయని అంచనా. ఒక్కో టన్ను ముడి ఖనిజం నుంచి 5.15 గ్రాముల బంగారం ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. గని నుంచి కనీసం 8.5 టన్నుల బంగారాన్ని వెలికి తీయవచ్చని, ఇది అండర్‌ గ్రౌండ్‌ మైన్‌ అని, ఇటువంటి గనిని అభివృద్ధి చేసే అవకాశం ఎన్ఎండీసీకి దక్కడం ఇదే తొలిసారని సత్పతి తెలిపారు.

బంగారాన్ని వెలికితీసిన తరువాత విక్రయించగా వచ్చిన ఆదాయంలో 38.25 శాతాన్ని ప్రభుత్వానికి ఆఫర్ చేసినట్టు వెల్లడించారు. అనుమతులు అన్నీ లభించిన తరువాత, ఏపీ ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకుని పనులు ప్రారంభిస్తామని, అప్పటి నుంచి బంగారం ఉత్పత్తి ప్రారంభం కావడానికి రెండేళ్ల సమయం పట్టవచ్చని పేర్కొన్నారు.

More Telugu News