Kerala: నమ్మలేని నిజం: కేరళలో లగ్జరీ కార్లున్న సుమారు 65 వేల మందికి ప్రభుత్వ పింఛన్లు!

  • వేలాదిమంది అనర్హులకు ప్రభుత్వ పింఛన్లు
  • అందరికీ ఖరీదైన లగ్జరీ కార్లు
  • స్వచ్ఛందంగా వదులుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక

పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, అందించే పెన్షన్లు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో చెప్పేందుకు ఇది చక్కని ఉదాహరణ. కేరళలో ఏకంగా 65 వేల మందికిపైగా ధనవంతులు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు, పెన్షన్లు అందుకుంటున్న విషయం తెలిసి అందరూ నివ్వెరపోతున్నారు. వీరందరికీ బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లు ఉండడం మరో విశేషం. వీరందరూ పేదలమంటూ ఎంచక్కా ప్రభుత్వ పథకాలను మెక్కేస్తున్నారు.

ఈ విధంగా రాష్ట్ర ఖజానాను దోచుకుంటున్న 64,473 మందిని ఏమనాలో తెలియక జనాల నోటి నుంచి మాట రావడం లేదు. ఏడాదికి లక్ష రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలు.. నెలకు లక్షలకు పైగా సంపాదిస్తున్న వారి జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. వీరంతా నెలకు రూ. వెయ్యి నుంచి రూ.1500 ప్రభుత్వ పింఛన్‌ను నొక్కేస్తున్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలు పొందుతున్న వారిలో 61 మందికి మెర్సిడెస్ బెంజ్, 28 మందికి బీఎండబ్ల్యూ, 2,465 మందికి లేటెస్ట్ స్కోడా, 296 మందికి హోండా, 191 మందికి మహింద్రా స్కార్పియో ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పెన్షన్లు అందుకుంటున్న మరికొందరు సంపన్నులను కూడా ఆర్థిక శాఖ గుర్తించింది. పిల్లలకు లగ్జరీ కార్లు ఉన్న తల్లిదండ్రులు కూడా పెన్షనర్ల జాబితాలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అటువంటి వారు మొత్తం 94,043 మంది ఉన్నట్టు తేలింది. ప్రస్తుతానికైతే వారికి అందుతున్న పథకాలను ఆపివేయబోమని, దీనిపై దర్యాప్తు జరిపిస్తామని మంత్రి వివరించారు.

పెన్షన్లు, ప్రభుత్వ పథకాలను అందుకుంటున్న అనర్హులు వాటిని స్వచ్ఛందంగా వదులుకుంటే ఎటువంటి చర్యలు ఉండవని, లేదంటే చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు.

More Telugu News