West Bengal: అ షాపులో అన్నీ 'దొంగ' వస్తువులే!

  • పశ్చిమ బెంగాల్ లో ఓ దొంగ నిర్వాకం
  • దొంగ సొత్తు అమ్మకానికి ఏకంగా షాపు ఏర్పాటు
  • సరుకులతో ఇంటిని గొడౌన్ గా మార్చేసిన వైనం
  • ముఠాను కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు

అతనో దొంగ. అయితేనేం కాస్త విభిన్నంగా ఆలోచించాడు. బంగారు నగలు, ఇతర ఆభరణాల జోలికి  పోకుండా కేవలం ఎలక్ట్రానిక్ పరికరాలు.. అందులోనూ  ఫోన్లనే కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఓ గ్యాంగ్ ను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. అనుచరులతో కలసి దొంగిలించిన వస్తువులతో ఏకంగా ఓ షాప్ ను కూడా తెరిచాడు. చివరికి ఈ ముఠా సభ్యుడొకరిని పట్టుకున్న పోలీసులు అందర్నీ కటకటాల వెనక్కి నెట్టారు.


కోల్ కతాకు చెందిన బిషు ఘోష్(35) రీజెంట్ పార్క్ సమీపంలోని ఇళ్లలో, మెట్రో స్టేషన్ పరిసరాల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లనే ఘోష్ దొంగిలించేవాడు. అనంతరం వీటిని నోటున్ పల్లిలో అద్దెకు తీసుకున్న ఇంట్లో దాచేవాడు. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా తాను మొబైల్ మెకానిక్ నని చెప్పేవాడు.

కొన్నాళ్లకు ఇంటిముందు చిన్నషాపును తెరిచి ఈ దొంగ సరుకును సెకండ్ హ్యాండ్ వస్తువులంటూ అమ్మడం మొదలెట్టాడు. చివరికి దొంగ సొత్తుతో ఈ ఇల్లు నిండిపోవడంతో దీన్ని గొడౌన్ గా మార్చేసి ధలై బ్రిడ్జ్ ప్రాంతంలో మరో ఇంటికి మారిపోయాడు. అక్కడే ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని దొంగ సొత్తును సేకరించేవాడు.

అయితే ఈ ప్రాంతంలో దొంగతనాలపై గత కొంతకాలంగా నిఘా పెట్టిన పోలీసులు.. బుధవారం ఘోష్ అనుచరుడు శుభంకర్ ను అరెస్ట్ చేశారు. అతనిచ్చిన సమాచారంతో  ఘోష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు 22 మొబైల్ ఫోన్లు, ఓ ఎల్ఈడీ టీవీ, 21 ఫోన్ బ్యాటరీలు, 17 సిమ్ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ముఠా నాయకుడు ఘోష్ పై ఇప్పటివరకూ ఎలాంటి కేసు నమోదు కాకపోవడాన్ని తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు.

More Telugu News