lunar eclipse: రేపటి చంద్ర గ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడొచ్చా?.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

  • 1.43 గంటల పాటు కొనసాగనున్న ఖగోళ అద్భుతం
  • ఎరుపు రంగులో కనువిందు చేయనున్నబ్లడ్ మూన్
  • ప్రకాశవంతంగా కన్పించనున్నఅంగారకుడు

చంద్ర గ్రహణాలపై ప్రపంచవ్యాప్తంగా పలు అపోహలు ప్రచారంలో ఉన్నాయి. చంద్ర గ్రహణాన్ని ప్రత్యేకమైన కళ్లద్దాల సాయంతోనే చూడాలనీ, లేదంటే కంటిచూపు దెబ్బతింటుందని కొందరు చెబుతుంటారు. మరికొందరేమో అసలు దీన్ని చూసేందుకు ఎలాంటి ప్రత్యేకమైన కళ్లద్దాలు అవసరం లేదని చెబుతుంటారు. అయితే వీటిలో ఏది నిజం? చంద్ర గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చా? దాని వల్ల నిజంగా కంటిచూపు దెబ్బతింటుందా? అంటే కాదనే నిపుణులు జవాబిస్తున్నారు.
 
జూలై 27(రేపు) రాత్రి సంభవించనున్న సంపూర్ణ అరుణ వర్ణ చంద్ర గ్రహణాన్ని(బ్లడ్ మూన్ లూనార్ ఎక్లిప్స్) ఎలాంటి ప్రత్యేకమైన కళ్లద్దాల అవసరం లేకుండానే ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్ర గ్రహణంలో సాధారణంగా రెండు దశలు ఉంటాయనీ, తొలిదశలో చంద్రుడిలోని కొంత భాగం భూమి నీడలోకి వస్తుందనీ, ఆ తర్వాత చంద్రుడు భూమి నీడలోకి పూర్తిగా రావడంతో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుందన్నారు. 

శుక్రవారం ఏర్పడనున్నఈ గ్రహణం 1.43 గంటల పాటు కొనసాగుతుంది. ఇంతసేపు చంద్ర గ్రహణం సంభవించడం చాలా అరుదైన విషయమని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. అంగారకుడు భూమికి దగ్గరగా రావడం వల్ల గ్రహణం సమయంలో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడన్నారు. 

గ్రహణం సందర్భంగా భూమిపై పడ్డ సూర్య కిరణాలు పరావర్తనం చెంది చంద్రుడిపై పడటంతో చందమామ అరుణ వర్ణంలో కనిపిస్తాడనీ, దీన్నే బ్లడ్ మూన్ గా పరిగణిస్తామన్నారు. శుక్రవారం గ్రహణం సందర్భంగా చంద్రుడు బ్లడ్ మూన్ రూపంలో దర్శనమిస్తాడన్నారు. అయితే సూర్య గ్రహణం సమయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే కంటిచూపును కోల్పోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

More Telugu News