Kishanreddy: ఇక ఎమ్మెల్యేగా వద్దులే... కిషన్ రెడ్డి కీలక నిర్ణయం!

  • ఎంపీ స్థానంపై కన్నేసిన బీజేపీ నేత
  • సికింద్రాబాద్ లేదా మల్కాజ్ గిరిపై దృష్టి
  • కేంద్రంలో మంత్రి పదవి టార్గెట్!

తెలంగాణ బీజేపీ నేత, అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తున్న జి.కిషన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆయన భావించడం లేదని, ఎంపీగా నిలిచి, తదుపరి కేంద్ర మంత్రివర్గంలో భాగం కావాలని ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారని కిషన్ రెడ్డి సన్నిహితులు అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకదాన్నుంచి ఆయన బరిలోకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే టార్గెట్ తో కిషన్ రెడ్డి గత కొంతకాలంగా రెండు నియోజకవర్గాల్లోనూ విస్తృత పర్యటనలు చేస్తూ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, కేంద్ర పథకాలను ప్రచారంలో తన అస్త్రాలుగా మార్చుకుని ఎంపీగా గెలవాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, కిషన్ రెడ్డి ఇప్పటివరకూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. 2004లో హిమాయత్ నగర్ నుంచి, ఆపై 2009, 2014లో అంబర్ పేట నుంచి ఆయన విజయం సాధించారు. ఇక కిషన్ రెడ్డికి ఎంపీ సీటు లభించిన పక్షంలో తన భార్య కావ్యను అంబర్ పేట నుంచి పోటీకి నిలపాలని కూడా ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో కావ్య సైతం పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ, డివిజన్ స్థాయిలో పర్యటనలు జరుపుతున్నారు. బస్తీల్లో తిరుగుతూ, అక్కడి ఆసుపత్రులలో రోగులను పరామర్శిస్తున్నారు.

More Telugu News