pawan kalyan: పార్లమెంటులో వ్యర్థ ప్రసంగాల వల్ల లాభమేంటి?: టీడీపీపై మరోసారి నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్

  • లోక్ సభలో టీడీపీ వాదన బలహీనంగా ఉంది
  • వ్యర్థమైన ప్రసంగాలు చేసినంత మాత్రాన ఇప్పుడు వచ్చేదేముంది?
  • మోసపోయామని చెబితే.. ప్రజలు నమ్ముతారా?

లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీ చేసిన వాదన చాలా బలహీనంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం వారు చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి లేదని తాను భావిస్తున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్పెషల్ ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా డిమాండ్ ను గతంలో వారు బలహీనపరిచారని చెప్పారు. వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేక హోదాకు గత మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి, ఈ రోజు పార్లమెంటులో వ్యర్థమైన ప్రసంగాలు చేసినంత మాత్రాన వచ్చే లాభమేమిటని ప్రశ్నించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతలకు... కేంద్ర ప్రభుత్వ వంచన తెలియడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే... మేము నమ్మాలా? అని అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ఇవ్వదనే విషయాన్ని తిరుపతి సభలో రెండున్నరేళ్ల క్రితమే తాను చెప్పానని... అయితే ఆరోజు బీజేపీని వెనకేసుకొచ్చిన నేతలు, ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని పవన్ ఎద్దేవా చేశారు. పాచిపోయిన లడ్డూల్లాంటి ప్యాకేజీని తీసుకుని, మమ్మల్ని తిట్టి, బీజేపీ నేతలకు సన్మానాలు చేసినవారికి... జరిగిన మోసం తెలుసుకోవడానికి ఇంత కాలం పట్టిందా? అని విమర్శించారు. వ్యక్తిగత లబ్ధి కోసం ప్రత్యేక హోదాను టీడీపీ తాకట్టు పెట్టిందని విమర్శించారు. టీడీపీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉండేదని... కానీ, ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో ఆ పార్టీ విఫలమైందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నాయకత్వంతో ప్రతి చోటా టీడీపీ కాంప్రమైజ్ అయిందని విమర్శించారు. చేసిందంతా చేసిన టీడీపీ... ఇప్పుడు కంటితుడుపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి, ఇప్పుడే పుట్టిన పసిపిల్లల మాదిరి... కేంద్రం చేత మోసగింపబడ్డామని చెబితే... ప్రజలు నమ్ముతారని టీడీపీ నేతలు ఎలా అనుకుంటారని పవన్ ప్రశ్నించారు. 

More Telugu News