Vizag: భారత యుద్ధ నౌకల పేల్చివేతకు పాక్ పన్నాగం... ఉగ్రవాదులకు డీప్ సీ డైవర్ శిక్షణ!

  • విశాఖ తీరంలోని నౌకలు, సబ్ మెరైన్లు టార్గెట్
  • ఇండియాలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారు
  • హెచ్చరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు
  • నిఘాను పెంచిన కేంద్రం

భారత యుద్ధ నౌకలను పేల్చివేసేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నినట్టు ఇంటెలిజన్స్ వర్గాలు పసిగట్టి, ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి చేర్చడంతో నేవీ అప్రమత్తమైంది. పఠాన్ కోట్ తరహా దాడికి పాల్పడి, విశాఖ తీరంలో ఉన్న యుద్ధ నౌకలను, జలాంతర్గాములను ధ్వంసం చేయాలన్న లక్ష్యంతో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇందుకోసం పది మంది ఉగ్రవాదులు ఇప్పటికే డీప్ సీ డైవర్లుగా శిక్షణ పొందారని, వీరంతా ముజఫరాబాద్ సమీపంలో ఉన్న కెల్, దుధినిహల్, లీపా లోయల గుండా ఇండియాలో చొరబడవచ్చని ఇంటెలిజెన్స్ భావిస్తోంది.

సముద్ర అంతర్భాగం గుండా జలాంతర్గాముల వద్దకు చేరి, వాటిని పేల్చే సాంకేతికత గురించి వారికి పూర్తి అవగాహన కూడా ఉందని, ఆధునిక ఆయుధ శిక్షణనూ వారు పూర్తి చేసుకున్నారని ఇంటెలిజెన్స్ సంస్థలను సమన్వయం చేసే మల్టీ ఏజెన్సీ సెంటర్ పేర్కొంది. నౌకాదళంపై దాడి చేయడమే వీరి లక్ష్యమని తెలిపింది. ఈ విషయం తెలిసిన తరువాత అప్రమత్తమైన నేవీ అధికారులు, జలాంతర్గాములు, యుద్ధ నౌకలకు అత్యాధునిక సెన్సార్లను అమర్చారని తెలుస్తోంది. యుద్ధ నౌకలైన ఐఎన్ఎస్ అరిఘాట్, అరిహంట్ లతో పాటు, అణ్వస్త్రాలను మోసుకెళ్లే ఐఎన్ఎస్ చక్ర జలాంతర్గామి కూడా విశాఖ తీరంలో మోహరించి ఉండటంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

More Telugu News