central university: ఏపీకి సెంట్రల్ యూనివర్శిటీ.. వచ్చే నెల 5 నుంచే అకాడెమిక్ సెషన్ ప్రారంభం: కేంద్ర మంత్రి జవదేకర్

  • అనంతపురం జిల్లా జంతలూరులో సెంట్రల్ యూనివర్శిటీ
  • ప్రారంభ దశలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మెంటార్ షిప్ కింద కార్యకలాపాలు
  • ఇచ్చిన హామీలు మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం

ఏపీ ప్రజలకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీపి కబురు అందించారు. అనంతపురం జిల్లా జంతలూరులో సెంట్రల్ యూనివర్శిటీని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. సెంట్రల్ యూనివర్శిటీస్ (అమెండ్ మెంట్) బిల్-2018కి కేబినెట్ ఆమోదం తెలిపిందని... ఏపీలో సెంట్రల్ యూనివర్శిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఉన్నత విద్యారంగంలో ఏపీకి ఇదొక మైలురాయి అని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని అన్నారు.

గతంలో ఈ తతంగం ముగియడానికి చాలా సమయం పట్టేదని... తొలుత కేబినెట్ నిర్ణయం తీసుకునేదని, ఆ తర్వాత పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యేదని చెప్పారు. ఇదంతా పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టేదని, దీని వల్ల ఒక విద్యా సంవత్సరం వేస్ట్ అయ్యే అవకాశం ఉందని... కానీ, మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అత్యంత వేగంగా ఏపీకి యూనివర్శిటీని మంజూరు చేశామని చెప్పారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి ఈ సెంట్రల్ యూనివర్శిటీలో అకాడెమిక్ సెషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రారంభదశలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మెంటార్ షిప్ కింద ఈ జాతీయ విద్యాలయం పని చేస్తుందని చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏపీ ప్రజలు సంబరాలు జరుపుకుంటారని అన్నారు.

More Telugu News