Virat Kohli: ఇంగ్లండ్‌పై ఇండియా మరీ ఇంత ఘోరంగా ఆడిందా?.. ఆ విషయం తెలిసి విస్తుపోతున్న అభిమానులు

  • వన్డే సిరీస్‌లో సిక్సర్లు కొట్టడానికి ఆపసోపాలు
  • మూడు వన్డేల్లో కలిసి ఆరు సిక్సర్లు
  • రెండు వన్డేల్లో సిక్సరే లేదు

ఆట ఏదైనా గెలుపు ఓటములు సహజం. క్రికెట్ లాంటి జంటిల్మన్ గేమ్‌లోనైతే ఓటమి కూడా హుందాగా ఉంటుంది. అయితే, ప్రపంచంలోనే మేటి జట్టుగా ప్రశంసలు అందుకుంటున్న భారత్.. ఇంగ్లండ్ గడ్డపై ఆడిన తీరు విమర్శలకు కారణమవుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను గెలుచుకున్న కోహ్లీ సేన వన్డేల్లో మాత్రం చతికిల పడింది. 1-2తో సిరీస్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్ విజయాన్ని ఎవరూ తక్కువ చేయడం లేదు కానీ, భారత జట్టు ఓడిన తీరు మాత్రం అభిమానులను నిశ్చేష్టులను చేసింది.

భారత జట్టు అంటేనే బ్యాటింగ్. అటువంటిది మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు సిక్సర్లు కొట్టడానికి ఆపసోపాలు పడ్డారు. ఐపీఎల్‌లో ఇరగదీసి సిక్సర్లు బాదిన ఆటగాళ్లు బ్యాట్ ఎత్తేందుకు నానా కష్టాలు పడ్డారు. మొత్తం మూడు మ్యాచుల్లోనూ కలిపి చచ్చీచెడీ ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే సిక్సర్లు కొట్టారు. అది కూడా తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాలుగు సిక్సర్లు కొడితే, చివరి మ్యాచ్‌లో పేసర్ శార్దూల్ ఠాకూర్ రెండు సిక్సర్లు కొట్టాడు. విచిత్రం ఏమిటంటే.. రెండో వన్డేలో టీమిండియా ఆటగాళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా సిక్సర్ కొట్టలేదు. ఓ ఇన్నింగ్స్ మొత్తంలో సిక్సర్ లేకపోవడం భారత జట్టులో ఇదే తొలిసారి.

More Telugu News