Almatti: నిండుకుండలా ఆల్మట్టి... కదిలొస్తున్న కృష్ణమ్మ!

  • ఇప్పటికే గోదారమ్మకు వరద ఉద్ధృతి
  • పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలు
  • మరో రెండు వారాలు వరద కొనసాగే అవకాశం

ఇప్పటికే గోదారమ్మ తల్లి గలగలా కదులుతుంటే, ఇప్పుడిక కృష్ణమ్మ బిరబిరా వస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి నిండుకుండలా మారింది. నేడో, రేపో ఆల్మట్టి గేట్లు ఎత్తనుండగా, వర్షాలు ఇలాగే పడుతుంటే, ఆపై ఐదు రోజుల్లోనే తుంగభద్ర రిజర్వాయర్ నిండుతుందని అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆపై నెలాఖరులోగా శ్రీశైలానికి వరద నీరు చేరుతుందని అంచనా.

పడమటి కనుమల్లో గత 24 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావడంతో కృష్ణమ్మకు మరింత వరద రావచ్చని భావిస్తున్న అధికారులు, మరిన్ని వర్షాలు కురుస్తాయని, ఆల్మట్టిలో 115 టీఎంసీల నీరు చేరగానే, వచ్చే వరదను దృష్టిలో ఉంచుకుని నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు వస్తున్న వరద కొనసాగితే, రేపు మధ్యాహ్నానికి ఆల్మట్టిలో నీరు సుమారు 120 టీఎంసీలకు చేరుతుంది. ఈ వరద రెండు వారాల వరకూ కొనసాగుతుందని అధికారుల అంచనా.

ఇదిలావుండగా, గోదావరిలో మాత్రం వరద ఉద్ధృతి అధికంగా ఉంది. ఒక్క రోజులోనే సుమారు 32 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలినట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం మీద ఈ సీజనులో దాదాపు 175 టీఎంసీల నీరు సముద్రంపాలైనట్టు చెబుతున్నారు.

More Telugu News