పెద్దలు కుదిర్చిన పెళ్లి.. ఆపై లవర్ తో వివాహం..చివరకు మరో వ్యక్తితో వెళ్లిపోయిన యువతి!
- ఒడిశాలో ఆశ్చర్యకర సంఘటన
- పెద్దలు కుదిర్చిన పెళ్లి.. 2 రోజులే కాపురం చేసింది
- లవర్ తో వివాహం..5 రోజులే కలిసుంది
- చివరకు మరో వ్యక్తితో వెళ్లిపోయిన వైనం
ఇటీవల ఓ యువతి తమ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆమె అక్కడ రెండే రోజులు గడిపింది. తర్వాత తానో యువకుడిని ప్రేమించానని అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తన భర్తకు, తల్లిదండ్రులకు ఆ యువతి చెప్పింది. పోలీసుల సమక్షంలో ఆ యువతి, ఆమె లవర్ పూల దండలు మార్చుకున్నారు.
అలా ఆ యువతి తన రెండో భర్తతో కలిసి ఐదు రోజులు గడిపింది. మర్నాడు తన భార్య కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో రెండో భర్త ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సదరు యువతి బంధువులు చెబుతున్న కథనం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ యువకుడి సైకిలెక్కి ఆమె వెళ్లిపోయిందని, దానిని తాము చూశామని అంటున్నారు.
కాగా, వారం రోజుల వ్యవధిలో ఇద్దరిని పెళ్లాడి.. ఆపై మరో వ్యక్తితో వెళ్లిపోయిన ఆ యువతి ఆచూకీ గురించి తెలుసుకునేందుకు ఆమె ఫొటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పోలీసులు పంపారు. ఆ యువతి తన రెండో భర్తతో కలిసి ఉన్న ఫొటో మీడియాలో హల్ చల్ చేస్తోంది.