Chandrababu: పడవ ప్రమాదాలు పెను సమస్యగా మారాయి: చంద్రబాబు

  • జల నియంత్రణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  • రిజర్వాయర్లన్నింటిలో నీటిని నిల్వ చేయండి
  • అక్రమ ఇసుక తవ్వకాలపై ఉక్కుపాదం మోపండి

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న పడవ ప్రమాదాలు విషాదాన్ని నింపుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ప్రమాదాలపై ఆవేదన వ్యక్తం చేశారు. పడవ ప్రమాదాలు పెను సమస్యగా మారాయని ఆయన అన్నారు. జల నియంత్రణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వంశధార నదిలో చిక్కుకుపోయిన కూలీలను రక్షించిన సిబ్బందిని ఆయన అభినందించారు. రెవెన్యూ, పోలీసు, విపత్తు నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేసి, అందరినీ కాపాడారని కితాబిచ్చారు. ఇదే స్ఫూర్తితో ఇకపై కూడా సమన్వయంతో పని చేయాలని సూచించారు. నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ మేరకు స్పందించారు.

ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయాలని అన్నారు. ముఖ్యంగా శ్రీశైలం, నాగార్జునసాగర్, సోమశిల, కండలేరు రిజర్వాయర్లపై దృష్టి సారించాలని చెప్పారు. 2019-2024 విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని ఆదేశించారు. గ్రామ దర్శిని- గ్రామ వికాసం కార్యక్రమంలో వారానికి రెండు రోజులు అధికారులు పాల్గొనాలని, ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని చెప్పారు. ఒక చోట వరదలు, మరొక చోట కరవు ఉండటం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమని తెలిపారు. 

More Telugu News