Pawan Kalyan: అందులో చిన్నారులున్నారని తెలిసి తీవ్ర వ్యథకు గురయ్యాను: పడవ బోల్తాపై పవన్‌ కల్యాణ్‌

  • పశువుల్లంక వద్ద గోదావరిలో పడవబోల్తా
  • గల్లంతైన వారి ఆచూకీ కోసం అన్ని చర్యలూ చేపట్టాలి
  • గల్లంతైనవారు సురక్షితంగా ఇంటికి చేరాలి 

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో పడవబోల్తా ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈరోజు ఓ పత్రికా ప్రకటన విడుదల చేస్తూ... "పడవ ప్రమాద వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. 30 మందితో వెళుతోన్న నాటు పడవ, నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్ ను ఢీకొట్టి ప్రమాదానికి లోనైందని, ఇందులో పాఠశాల నుంచి వస్తున్న చిన్నారులున్నారని తెలిసి తీవ్ర వ్యథకు గురయ్యాను.

గల్లంతైన వారి ఆచూకీ కోసం అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలి. గల్లంతైనవారు సురక్షితంగా ఇంటికి చేరాలని కోరుకొంటున్నాను. కొన్ని నెలల కిందట జరిగిన వాడపల్లి పడవ ప్రమాదం మరువక ముందే గోదావరి నదిలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరం.

జీవితాల్ని ఫణంగా పెట్టి నాటు పడవల్లో ప్రయాణం చేసే పరిస్థితుల నుంచి లంక గ్రామాల ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సురక్షితమైన, భద్రతా ప్రమాణాలతో కూడిన నదీ ప్రయాణాల్ని అందుబాటులోకి తీసుకురావాలి" అని పేర్కొన్నారు. 

More Telugu News