ASI: ఈ మూడు ప్రాంతాలు మినహా... అన్ని ఆర్కియాలజికల్ సైట్లలో ఇక ఫొటోలు, సెల్ఫీలు దిగొచ్చు!

  • తాజ్ మహల్ లోపల ఉన్న స్మారక చిహ్నం, అజంతా గుహలు, లెహ్ ప్యాలెస్ లో అనుమతి లేదు
  • మిగిలిన అన్ని పురాతన కట్టడాల వద్దా ఫొటోలు దిగొచ్చు
  • ప్రధాని నరేంద్ర మోదీ సూచనపై కదిలిన ఏఎస్ఐ

ఏఎస్ఐ (ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) అధీనంలో ఉన్న అన్ని పురాతన కట్టడాల వద్దా ఇకపై ఫొటోలు, సెల్ఫీలు దిగవచ్చు. కట్టడాల వద్ద ఫొటోలు దిగరాదన్న నిర్ణయం వెనకున్న లాజిక్ ఏంటో తనకు అర్థం కావడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత పురావస్తు శాఖ ఫొటోలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తాజ్ మహల్ లోపల ఉన్న స్మారక చిహ్నం, అజంతా గుహలు, లెహ్ ప్యాలెస్ లో మాత్రం ఫొటోలకు అనుమతించబోమని తేల్చి చెప్పింది. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,686 కట్టడాలు ఏఎస్ఐ అధీనంలో ఉన్నాయి.

"ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు, సలహాల నేపథ్యంలో కేంద్ర పరిరక్షణలో ఉన్న అన్ని పురాతన కట్టడాల వద్దా ఫొటోగ్రఫీకి అనుమతిస్తున్నాం" అని కేంద్ర మంత్రి మహేష్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. అంతకుముందు న్యూఢిల్లీలోని ఏఎస్ఐ సరికొత్త అధికార కార్యాలయ భవనం 'ధరోవర్ భవన్'ను ప్రారంభించిన నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఓపక్క సుదూరంగా ఉన్న శాటిలైట్లే అన్ని కట్టడాలనూ ఫొటోలు తీసుకుంటున్నప్పుడు, మన దేశ ప్రజలను ఆ ఫొటోలు ఎందుకు తీసుకోనివ్వడం లేదంటూ ప్రశ్నించారు. ప్రజలను అలా అడ్డుకోవడం ఏఎస్ఐ హక్కేమీ కాదని అన్నారు. కాగా, 2016 నుంచి పురాతన కట్టడాల వద్ద ఫొటోలు తీసుకోవాలంటే ఏఎస్ఐ అనుమతి తప్పనిసరన్న ఉత్తర్వులు అమలవుతున్నాయి.

More Telugu News