BSE: పాత రికార్డులన్నీ బద్దలు.... ఆల్ టైమ్ హైలో భారత స్టాక్ మార్కెట్... ఇన్వెస్టర్ల సంబరాలు!

  • అన్ని వైపుల నుంచి శుభశకునాలు
  • ఉదయం 10.16 గంటల సమయంలో సరికొత్త రికార్డు
  • దూసుకెళుతున్న సెన్సెక్స్, నిఫ్టీ

అన్ని వైపుల నుంచి మంచి శకునాలే కనిపిస్తుండటంతో భారత స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డు స్థాయిని ఈ ఉదయం తాకింది. నిన్నటి యూరప్, యూఎస్ మార్కెట్ల లాభాలు, నేటి ఆసియా మార్కెట్లు సాగుతున్న సరళి, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచడం, అమెరికా ఆంక్షలు విధించినా, స్నేహబంధం కొనసాగించాలని భారత్, ఇరాన్ లు నిర్ణయించుకోవడం, యూఎస్ లో నిరుద్యోగుల సంఖ్య తగ్గిందన్న రిపోర్టు వంటి అంశాలు మార్కెట్ భారీ లాభాలకు సహకరించాయి.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు తోడు ఫండ్ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొత్త కొనుగోళ్లకు ప్రయత్నించడంతో మార్కెట్ పాత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ ఉదయం 10.16 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ గత ఆల్ టైమ్ రికార్డు 36,443 పాయింట్లను దాటి 36,450 పాయింట్లకు చేరుకోగా, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సంబరాల్లో మునిగింది.

ఆపై కూడా తన జోరును కొనసాగిస్తూ, 36,525 పాయింట్లకు సెన్సెక్స్ చేరుకున్న వేళ, స్వల్పంగా లాభాల స్వీకరణ కనిపించింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక కూడా అత్యంత కీలకమైన 11 వేల పాయింట్ల మార్కును దాటింది. హిందుస్థాన్ పెట్రోలియం, బీపీసీఎల్, ఐఓసీ, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్ సర్వ్ తదితర కంపెనీలు లాభపడగా, ఇన్ ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎంఅండ్ఎం, టీసీఎస్ తదితర కంపెనీలు నష్టపోయాయి.

More Telugu News