Hyderabad: పరిపూర్ణానంద బహిష్కరణకు కారణాలు ఇవే... మీడియాకు చెప్పిన హైదరాబాద్ పోలీసులు!

  • పలు సందర్భాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు
  • చాలా ప్రాంతాల్లో యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు
  • నగర బహిష్కరణ నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చన్న పోలీసులు

శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నగరం నుంచి ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందో వివరిస్తూ మీడియాకు సుదీర్ఘ ప్రకటనను విడుదల చేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, వాటిపై తమ విచారణలో తేలిన వివరాలను వెల్లడించారు. 2017 నవంబర్ 1న మెదక్ జిల్లా రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభలో మాట్లాడిన స్వామీజీ, ముస్లింలకు, క్రైస్తవులకు మక్కా, జెరూసలెం వెళ్లేందుకు డబ్బిస్తున్న ప్రభుత్వాలు ప్రజాధనాన్ని సబ్సిడీలుగా మారుస్తున్నాయని, హిందువులకు మాత్రం పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు డబ్బివ్వకుండా, సర్ ఛార్జీలను పేరుతో పన్నులు వసూలు చేస్తున్నారని ఆరోపించారని, తమ విచారణలో ఇవి అభ్యంతరకర వ్యాఖ్యలని తేలిందని తెలిపారు.

ఆపై 2017 డిసెంబర్ 2న కామారెడ్డి జిల్లాలో మాట్లాడుతూ, "మీకు నిజాం పాలన కావాలా? లేక ఛత్రపతి శివాజీ పాలన కావాలా?" అంటూ యువతను ప్రశ్నించారని, అదే సమయంలో బాబర్, గజనీ మహమ్మద్, ఖిల్జీ, హుమాయున్ తదితరుల పేర్లు చెబుతూ, వారు హిందువులపై అరాచకాలు చేశారని, అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడ్డారని, హిందువులను హత్యలు చేశారని మాట్లాడుతూ, యువతలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, ఇవి కూడా అభ్యంతరకరమేనని అన్నారు.

మరోసారి ఆయన మాట్లాడుతూ, రజాకార్లను ప్రస్తావించి, హిందూ మహిళలపై వారు దమనకాండ సాగించారని అన్నారని, నిజామాబాద్ పేరును ఇందూరుగా పేరు మార్చాలని డిమాండ్ చేశారని, హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్‌ల పేర్లు మార్చాలని వ్యాఖ్యానించారని చెప్పుకొచ్చారు. ఈ సంవత్సరం మార్చిలో కరీంనగర్ లో మాట్లాడిన ఆయన పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా, తెలంగాణ ప్రివెంటేషన్ ఆఫ్ యాంటీ-సోషల్ అండ్ హాజర్డస్ యాక్టివిటీస్ యాక్ట్ -1980 చట్టం ప్రకారం షోకాజ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. తాము నోటీసులు ఇచ్చినా, ఆయన్నుంచి సమాధానం రాకపోవడంతోనే ఆరు నెలలపాటు హైదరాబాద్ నగరంలోకి రాకుండా నిషేధం విధించామని బంజారాహిల్స్ ఏసీపీ సంతకంతో ఉన్న ఈ ప్రకటనలో ఉంది.

ఇక, ఆరు నెలల తరువాత ఆయన హైదరాబాద్‌ కు రావాలంటే, తమ అనుమతి తీసుకోవాలని, ఎక్కడ ఉంటారన్న విషయంతో పాటు ఎంతకాలం ఉంటారన్న విషయాన్ని చెప్పాలని ఆదేశించినట్టు వెల్లడించారు. తమ నగర బహిష్కరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ఆయన రెండు వారాల్లోగా ట్రైబ్యునల్ ను ఆశ్రయించవచ్చని అన్నారు.

More Telugu News