Police: బరువు తగ్గకుంటే ఇంటికే.. కర్ణాటక పోలీసులకు ఏడీజీ అల్టిమేటం

  • బాన పొట్టల పోలీసులకు ఇక తిప్పలే
  • తగ్గించుకోకుంటే చర్యలు
  • దేశం ఆరోగ్యకరమైన వ్యక్తులను కోరుకుంటోందన్న ఏడీజీ

బరువు రూపంలో కర్ణాటక పోలీసులకు కొత్త చిక్కొచ్చి పడింది. పెరుగుతున్న శరరీ బరువును తగ్గించకుంటే సస్పెన్షన్ వేటు తప్పదంటూ ఆ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ భాస్కరరావు హెచ్చరించారు. బరువు ఎక్కువున్న పోలీసులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొన్నారు. నిర్దేశిత బరువు కంటే ఎక్కువ ఉన్న పోలీసులు తప్పకుండా దానిని తగ్గించుకోవాల్సిందేనని, లేదంటే సస్పెన్షన్ వేటుకు గురి కావడమో, కఠిన విధులు అప్పజెప్పడమో, అదనపు డ్యూటీలు వేయడమో చేస్తామని ప్రకటించి పోలీసుల గుండెల్లో వణుకు పుట్టించారు.

దేశం ఆరోగ్యవంతమైన వ్యక్తులను కోరుకుంటోందన్న ఏడీజీ, అందుకు అనుగుణంగా పోలీస్ క్యాంటీన్లలో అందించే ఆహారంలోనూ మార్పులు చేయనున్నట్టు తెలిపారు. పోలీస్ క్యాంపుల్లో శారీరక దారుఢ్య కార్యక్రమాలను పెంచుతామన్నారు. బరువు ఎక్కువ ఉన్న పోలీసులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తామన్నారు. గడువులోగా బాన పొట్టలు తగ్గించుకోకుంటే చర్యలకు సిద్దంగా ఉండాలని భాస్కరరావు హెచ్చరించారు.

More Telugu News