Godavari: ఉప్పొంగిన గోదావరి... భద్రాచలం వద్ద 26 అడుగుల నీరు!

  • ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాణహిత, పెన్ గంగ
  • ఈ సీజన్ లో అత్యధిక వరద
  • తాలిపేరు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదులైన ప్రాణహిత, పెన్ గంగ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో, ఈ సీజన్ లో అత్యధిక వరద నమోదైంది. తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో, నాలుగు గేట్లను ఎత్తిన అధికారులు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని కిందకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 26 అడుగుల ఎత్తునకు పెరిగింది. దీంతో నదీ పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ప్రాణహిత వరద కలుస్తుండటంతో, గోదావరిలో 7.2 మీటర్ల నీరు ప్రవహిస్తోంది. ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు వెల్లడించారు. కాళేశ్వరం నుంచి 2.43 లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీ నుంచి 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. మరోవైపు కడెం ప్రాజెక్టు నిండింది. 700 అడుగుల మేరకు నీటి నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టులో ప్రస్తుతం 697.625 అడుగుల మేరకు నీరు ఉంది. ఇదిలావుండగా, ఆదిలాబాద్ జిల్లాలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నీల్వాయి వాగును దాటుతూ మోర్ల సోమయ్య అనే రైతు గల్లంతయ్యాడు.

More Telugu News