Telangana: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ హెచ్చరిక

  • ఒడిశాలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • నిలిచిన బొగ్గు ఉత్పత్తి, కాళేశ్వరం పనులు

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా వరంగల్, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, నల్లగొండ, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, వచ్చే రెండు రోజుల్లో ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, మంచిర్యాలలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, తాజా వర్షాలు వ్యవసాయదారులకు మేలు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ పేర్కొంది.

గత 24 గంటల్లో ఇల్లెందులో 9 సెంటీమీటర్లు, ఏన్కూరులో 7, వెంకటాపూర్, ఖమ్మం అర్బన్, జూలూరుపాడులో ఆరు సెంటీమీటర్ల చొప్పున, డోర్నకల్, అశ్వారావుపేట, మణుగూరు, బయ్యారం,  కొత్తగూడెం, మధిరలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు  ‌భారీ వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూడు రోజులుగా కాళేశ్వరం పనులు కూడా నిలిచిపోయాయి.

More Telugu News