Swetha Reddy: శ్వేతను ప్రేమించానంటున్న 'కిడ్నాప్' కేసు నిందితుడు భరత్!

  • గత నెల 30న ఘటన
  • ఎలాగైనా శ్వేతను దక్కించుకోవాలని భరత్ ప్లాన్
  • శ్వేత బైక్ ఎందుకు ఎక్కిందన్న కోణంలో పోలీసుల విచారణ

ఆరు రోజుల క్రితం అశోకా ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చి, బైకుపై బోదనపు శ్వేతారెడ్డి (24) అనే యువతిని బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని, యాక్సిడెంట్ చేసి ఆమె మృతికి కారణమైన బాడిగె భరత్, పోలీసుల విచారణలో పలు వివరాలు వెల్లడించాడు. శ్వేతారెడ్డికి, నార్కట్ పల్లి మండలం అమ్మనబోలుకు చెందిన భరత్ కు పాత పరిచయం ఉంది. శ్వేతను ప్రేమిస్తున్నానంటూ భరత్ వెంటపడుతూ ఉండేవాడు.

ఇటీవల శ్వేతకు మరో అబ్బాయితో సంబంధాన్ని నిశ్చయించిన తండ్రి బోదనపు మధుసూదన్ రెడ్డి నిశ్చితార్థాన్ని ఘనంగా జరిపించాడు. ఈ విషయం తెలుసుకున్న భరత్, ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని ప్లాన్ వేశాడు. ఎంబీఏ పరీక్షకు హాజరైన శ్వేతను బైక్ ఎక్కించుకుని హైదరాబాద్ వైపు తీసుకు వెళుతుంటే, ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా బైక్ అదుపుతప్పింది.

అనంతరం హయత్ నగర్ లోని సన్ రైజ్ ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె నిన్న మరణించగా, భరత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. కాలేజీ వద్ద ఆమె భరత్ బైక్ ఏ కారణంతో ఎక్కిందన్న వివరాలు సేకరిస్తున్నారు. ఆపై వారి మధ్య జరిగిన వాగ్వాదం గురించి వివరాలను భరత్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. శ్వేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సన్ రైజ్ హాస్పిటల్ నుంచి చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More Telugu News