TRS: వివాదంలో టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్.. లైంగిక దోపిడీకి పాల్పడ్డారంటూ ప్రధానికి పాత్రికేయుల లేఖ!

  • బాల్క సుమన్ లైంగిక దోపిడీకి పాల్పడ్డారు
  • వారు నిందితులు కాదు.. బాధితులు
  • ఎంపీ బాగోతాన్ని బయటపెట్టవద్దని హెచ్చరిస్తున్నారు
  • మహిళా కమిషన్ జోక్యం చేసుకోవాలి

టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ వివాదంలో చిక్కుకున్నారు. పలువురు మహిళలపై ఆయన లైం‌గిక దోపిడీకి పాల్పడ్డారని పాత్రికేయులు మల్హోత్రా, సురభి నిర్మల్, న్యాయవాదులు వీఎస్ రావు, ఎంఎస్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఆ వివరాలలోకి వెళితే, మే 31న సాయంత్రం బంజారాహిల్స్‌లోని ఎం‌పీ అపార్ట్‌మెంట్‌కు ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు వచ్చి తనను బెదిరించారని ఎంపీ సహాయకుడు మర్రి సునీల్ గత నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోకి చొరబడిన వారు సుమన్ కోసం ఇల్లంతా వెతికారని, ఆయన లేరని చెప్పడంతో దుర్భాషలాడి వెళ్లారని, మంచిర్యాలకు ఎలా వస్తాడో చూస్తామని హెచ్చరించి వెళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి పేర్లను సంధ్య, విజేత, శంకర్‌, గోపాల్‌లుగా పేర్కొన్నారు.

అయితే, సునీల్ చెబుతున్నట్టు సంధ్య, విజేతలు నిందితులు కాదని, ఆ ఇద్దరు మహిళలతో పాటు మరెందరో ఎంపీ చేతిలో లైంగిక దోపిడీకి గురైన బాధితులని పాత్రికేయులు మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా, సునీల్ ఫిర్యాదుపై ఆ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, నిందితులు అక్రమంగా ఎంపీ ఇంట్లోకి ప్రవేశించారని సునీల్ తన ఫిర్యాదులో పేర్కొనగా, పోలీసులు మాత్రం ఎంపీ పేరు లేకుండా ఎఫ్‌ఐఆర్ రాయడం గమనార్హం.

నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు మనుషులు బాధితులను అక్రమంగా నిర్బంధించి వివరాలు తీసుకున్నారని, ఎంపీతో వారికి ఉన్న సంబంధాలను బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని మల్హో‌త్రా, సురభి నిర్మల్‌లు ఆరోపించారు. ఈ విషయంలో మహిళా కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలని, బాధితులను ఎంపీ, పోలీసుల బారి నుంచి కాపాడాలని కోరారు. అలాగే, కేసును సీబీఐకి అప్పగించి పూర్తి వివరాలు రాబట్టాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News