Reliance: సెకనుకు గిగాబైట్ల వేగాన్ని చూపిస్తాం: ముఖేష్ అంబానీ

  • ఫైబర్ గ్రిడ్ రాకతో విప్లవాత్మక మార్పులు
  • ఇండియా ఎగుమతుల్లో రిలయన్స్ కు 8.9 శాతం వాటా
  • మరింత నాణ్యమైన బ్రాడ్ బ్యాండ్ సేవలు త్వరలో

ఒక సెకనుకు గిగాబైట్ల వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలను రిలయన్స్ సంస్థ దగ్గర చేయనుందని ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. సంస్థ ఏజీఎంలో మాట్లాడిన ఆయన, ఫైబర్ గ్రిడ్ అందుబాటులోకి వచ్చిన తరువాత విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, ఆ ఫలాలను భారతీయులకు అందిస్తామని తెలిపారు. ఇండియా నుంచి వెళ్లే ఎగుమతుల్లో రిలయన్స్ కు 8.9 శాతం వాటా ఉందని చెప్పిన ముఖేష్, జియో రాకతో ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సేవలు దగ్గరయ్యాయని అన్నారు. సరికొత్త సేవలు ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఫిక్సెడ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ పై విస్తరించనున్నామని అంబానీ తెలిపారు.

తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, కుమారుడు, కుమార్తెతో కలసి వచ్చిన ఆయనకు రిలయన్స్ ఇన్వెస్టర్లు ఘన స్వాగతం పలికారు. షేర్ హోల్డర్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, జియో ఫోన్ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఫిక్సెడ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ విస్తరణలో భారత స్థానం 134గా ఉందని గుర్తు చేసిన ఆయన, ఏడాది వ్యవధిలోనే టాప్ 100 లోపలికి చేరుతుందని అన్నారు.

డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు అవసరమైన పెట్టుబడులను పెడుతున్నామని, ఇప్పటికే రూ. 250 కోట్లను వెచ్చించామని వెల్లడించారు. ఫైబర్ కనెక్టివిటీని ఇళ్లకు, చిన్న మధ్య తరహా కంపెనీలకు అందించేందుకు కృషి చేస్తున్నామని, త్వరలోనే 1,100 నగరాలు, పట్టణాల్లో సేవలను ప్రారంభిస్తారని చెప్పారు. వ్యాపారస్తుల కోసం క్లౌడ్ అప్లికేషన్స్, మరింత వేగంగా పనిచేసే బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తామని ముఖేష్ అంబానీ తెలిపారు. ఇండియాలో ఉద్యోగ సృష్టికి రిలయన్స్ తనవంతు సహకారాన్ని అందిస్తోందని ఆయన చెప్పారు.

More Telugu News