Bilawal Bhutto Zardari: రాజకీయాల్లోకి వచ్చినందుకు మా అమ్మే బాధపడంది.. నేను కూడా రావాలనుకోలేదు: బిలావల్ భుట్టో

  • ఈ నెల 25న‌ పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు
  • ప్రచారంలో దూసుకుపోతున్న బిలావల్
  • పూలు చల్లి అభిమానాన్ని చాటుకుంటున్న ప్రజలు

తాను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత, మాజీ ప్రధాని బేనజిర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో తెలిపారు. ఈ నెల 25న జరగనున్న సార్వత్రిక ఎన్నికల బరిలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న ఆయన మాట్లాడుతూ.. తానెప్పుడూ రాజకీయాలను ఎంచుకోలేదన్నారు. తన తల్లి కూడా రాజకీయాల్లోకి వచ్చినందుకు పదేపదే బాధపడిందని చెప్పారు.

‘‘మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది, రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని, రాకుండా ఉంటే బాగుండేదని. అదే విషయాన్ని నాకూ చెప్పింది. రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దని’’ అని 29 ఏళ్ల బిలావల్ తెలిపారు. ప్రస్తుత ఎన్నికల బరిలో పీఎం అభ్యర్థిగా ఉన్న ఆయన 20 అడుగుల ఎత్తున్న బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రచారంలో తానెప్పుడూ భయపడలేదన్నారు. పీటీఐ చీఫ్, ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ఖాన్‌పై విమర్శలు కురిపించారు. కాగా, బిలావల్ ర్యాలీకి ప్రజల నుంచి విశేష మద్దతు లభించింది. ఆయనపై గులాబీ రేకులు చల్లి అభిమానాన్ని చాటుకున్నారు.

More Telugu News