Sachin Tendulkar: ‘జబ్ ఎస్ఆర్కే మెట్ ఎస్ఆర్టీ’ అని సచిన్ ట్వీట్ కు షారూక్ ఆసక్తికర రిప్లై

  • అంబానీ కుమారుడు నిశ్చితార్థ వేడుకల్లో సచిన్-షారూక్ సెల్ఫీ
  • ‘జబ్ ఎస్ఆర్కే మెట్ ఎస్ఆర్టీ’ అంటూ ఆ సెల్ఫీని పోస్ట్ చేసిన సచిన్
  • ఈ ఫొటోను మాత్రం జీవితాంతం దాచుకుంటానంటూ షారూక్ రిప్లై

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థ వేడుకలు ముంబైలో ఇటీవల ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ప్రముఖ వ్యాపార దిగ్గజాలు సహా సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ అగ్రనటుడు షారూక్ ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా హాజరయ్యారు.

 ఈ సందర్భంగా షారూక్, సచిన్ లు ప్రత్యేకమైన క్యాప్స్ ధరించి ఓ సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. షారూక్ నటించిన ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ చిత్రం పేరును తలపించేలా ఓ క్యాప్షన్ పెట్టి ఆ ఫొటోను సచిన్ పోస్ట్ చేయడం ఆసక్తిదాయకం. ‘జబ్ ఎస్ఆర్కే మెట్ ఎస్ఆర్టీ’ అనే క్యాప్షన్ తో దీనిని జతపరిచారు. ఎస్ఆర్కే అంటే షారూక్ ఖాన్, ఎస్ఆర్టీ అంటే సచిన్ రమేష్ టెండూల్కర్ అని అర్థం.

కాగా, ఈ ట్వీట్ పై షారూక్ రిప్లై ఇచ్చారు. ‘సాధారణంగా మేము ఫొటో ఆల్బమ్స్ దాచి పెట్టుకోం. కానీ, ఓ గొప్ప వ్యక్తితో కలిసి దిగిన ఈ ఫొటోను మాత్రం జీవితాంతం దాచుకుంటాను’ అని చెప్పిన షారూక్, కొన్నేళ్ల క్రితం వాళ్లిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటోను ఈ ఫొటోకు జతపరిచి..‘అప్పుడూ ఇప్పుడూ’ క్యాప్షన్ పెట్టారు. 

More Telugu News