ICC: క్రికెటర్లపై నిబంధనలు మరింత కఠినం చేసిన ఐసీసీ!

  • ఇక బాల్ ట్యాంపరింగ్ చేస్తే 12 టెస్టుల వరకూ నిషేధం
  • తప్పును లెవల్-3కి మార్చిన ఐసీసీ
  • వెల్లడించిన డేవిడ్ రిచర్డ్ సన్

క్రికెటర్ల ప్రవర్తనా నియమావళిని మరింత కఠినం చేస్తూ, సోమవారం నాడు డబ్లిన్ లో జరిగిన ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) వార్షిక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడే ఆటగాళ్లను ఇకపై ఎంతమాత్రమూ ఉపేక్షించరాదని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌ సన్‌ వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ఇకపై బాల్ ను మార్చాలని చూస్తే కనిష్ఠంగా ఆరు టెస్టు మ్యాచ్ ల నుంచి గరిష్ఠంగా 12 మ్యాచ్ ల వరకూ నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.

గతంలో ఒక టెస్టు, రెండు వన్డేల నిషేధం మాత్రమే ఉండేదని గుర్తు చేసిన ఆయన, తాజా నిబంధనలతో ఆటలో మరింత పారదర్శకత పెరుగుతుందని, ఇంకా బాధ్యతగా ఆటగాళ్లు మెలగుతారని భావిస్తున్నామని అన్నారు. కొత్త ప్రవర్తనా నియమావళిలో బాల్ ట్యాంపరింగ్ తప్పు స్థాయిని లెవల్-3కి పెంచినట్టు తెలిపారు. కాగా, ఇటీవల ఇంగ్లండ్ తో మ్యాచ్ లో బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్ లు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.

More Telugu News