italy: ముంబైలో దారుణం.. ఇటలీ మహిళపై టూరిస్ట్ గైడ్ అత్యాచారం

  • ఇండియాను చూడటానికి వచ్చిన 37 ఏళ్ల ఇటలీ మహిళ
  • రేడియో ట్యాక్సీలో ఆమెపై అత్యాచారం
  • సెక్షన్ 376 కింద కేసు నమోదు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో దారుణం సంభవించింది. మన దేశాన్ని చూడటానికి వచ్చిన 37 ఏళ్ల ఇటలీ మహిళా టూరిస్టుపై టూరిస్ట్ గైడ్ అత్యాచారం చేశాడు. క్యాబ్ లో ఆమెను రేప్ చేశాడు. జూన్ 14న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి, ఇటలీ ఎంబసీ అధికారులను ఆమె కలిసింది. ఈ నేపథ్యంలో, ముంబైకి తిరిగి వెళ్లి, అత్యాచారానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎంబసీ అధికారులు సూచించారు. జుహు పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

2017 నవంబర్ లో బాధితురాలు ఇండియాకు వచ్చింది. కొంత కాలం బెంగుళూరులో ఉన్న తర్వాత జూన్ 11న ముంబైకి వచ్చింది. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం, జూన్ 14న గేట్ వే ఆఫ్ ఇండియాను చూడ్డానికి ఆమె వెళ్లింది. అక్కడ 'ముంబై దర్శన్' పేరుతో ఓ ప్రైవేట్ బస్ ఏజెన్సీ ఇచ్చిన ప్రకటనను చూసింది. అదే సమయంలో ఓ వ్యక్తి ఆమెను కలిసి, టూరిస్ట్ గైడ్ గా పరిచయం చేసుకున్నాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత ముంబై దర్శన్ టికెట్ ను బుక్ చేసింది. తనకు ముంబైని చూపిస్తానన్న గైడ్ కు కూడా కొంత మొత్తాన్ని అందించింది.

ఆ రోజు సాయంత్రం టూర్ పూర్తయిన తర్వాత... బాలీవుడ్ యాక్టర్ల నివాసాలను చూపిస్తానని చెప్పడంతో, ఆమె సరే అంది. అతనితో పాటు రాత్రి 8.30 గంటల సమయంలో బయల్దేరింది. ఆ తర్వాత ఒక నటుడి నివాసం చూపించి, దక్షిణ ముంబైలో ఆమె బస చేసిన హోటల్ కు ఓ రేడియో టాక్సీలో తీసుకెళ్లాడు. ఆ హోటల్ పక్కనే తాను నివసిస్తున్నాని చెప్పాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఓ లిక్కర్ షాప్ వద్ద ట్యాక్సీని ఆపాలంటూ డ్రైవర్ ను కోరాడు. అక్కడ బీరు కొనుగోలు చేసి, బాధితురాలికి కూడా కొంచెం ఆఫర్ చేశాడు. అయితే, తీసుకోవడానికి ఆమె తిరస్కరించింది.

ఆ తర్వాత ఆమెను తాకడానికి అతను ప్రయత్నించాడు. ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అరవాలని ప్రయత్నించిన ఆమె నోరును మూసేశాడు. ఆ తర్వాత ఆమె కొన్ని ఫొటోలు తీసుకుంది. ఆ మరుసటి రోజు ఆమెను మళ్లీ కలిసేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆమె అతన్ని కలవకుండా, జూన్ 18న బెంగళూరుకు వెళ్లిపోయింది. అక్కడ ఓ ఆశ్రమంలో గడిపి... జూన్ 26న ఢిల్లీకి వెళ్లింది. అక్కడ ఎంబసీ అధికారులను కలిసింది. ఆ తర్వాత ముంబైకి వచ్చి, ఓ లాయర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై జుహు పోలీసులు సెక్షన్ 376 కింద రేప్ కేసు నమోదు చేశారు.

More Telugu News