S-400: అమెరికా వారించినా వినని ఇండియా... రష్యాతో రూ. 39 వేల కోట్ల ఆయుధ డీల్!

  • ఎస్-400 సిస్టమ్ ను కొనుగోలు చేయనున్న ఇండియా
  • రష్యాతో డీల్ కుదుర్చుకుంటే ఆంక్షలు తప్పవంటున్న అమెరికా
  • అయినా సరే క్షిపణి వ్యవస్థ కావాల్సిందేనన్న ఇండియా

రష్యాతో ఆయుధాల కొనుగోలు డీల్ వద్దని అమెరికా హెచ్చరించినా భారత్ వినలేదు. ఎస్-400 ట్రియంఫ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు రూ. 39 వేల కోట్లతో డీల్ కుదుర్చుకోనుంది. ఈ డీల్ కుదిరితే ఇండియాపై ఆంక్షలు విధిస్తామని అమెరికా గతంలో హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.

 రష్యాతో డీల్ కు సర్వం సిద్ధమైందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన డీఏసీ (డిఫెన్స్ అక్విజిషన్స్ కౌన్సిల్) ఈ డీల్ ను ఆమోదించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రష్యాతో చర్చించడం కూడా ముగిసిందని, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ లభించాల్సివుందని, ఆపై ప్రధాని అధ్యక్షతన సమావేశమయ్యే క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందగానే, రష్యా నుంచి ఎస్-400 వ్యవస్థ ఇండియాకు చేరేందుకు మార్గం సుగమమవుతుందని అధికారులు వెల్లడించారు.

కాగా, అమెరికాలో జరగాల్సిన రక్షణ, విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం రద్దయిన నేపథ్యంలో నిన్న సమావేశమైన డీఏసీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

More Telugu News