Sushma: ముస్లింలకు సహకారమేంటంటూ సుష్మా స్వరాజ్ పై విమర్శలు... ఇది సరైనదేనా? అంటూ పోల్ ప్రారంభించిన సుష్మ!

  • మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్ పోర్టు ఇప్పించిన సుష్మ
  • ఘాటుగా స్పందిస్తున్న నెటిజన్లు
  • ట్వీట్లను ఆమోదిస్తారా? అంటూ పోల్

మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటకు పాస్ పోర్టును ఇప్పించడంలో సాయపడిన సుష్మాస్వరాజ్ ను విమర్శిస్తూ, ట్విట్టర్ లో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆమె ఘాటుగా స్పందించారు. తనను విమర్శిస్తున్న వారిని టార్గెట్ చేస్తూ, "స్నేహితులారా... కొన్ని ట్వీట్లు నాకు నచ్చాయి. గత కొద్ది రోజులుగా ఇలా జరుగుతూఉంది. ఈ తరహా ట్వీట్లను మీరు ఆమోదిస్తారా?" అని ప్రశ్నిస్తూ గత రాత్రి 10.49 సమయంలో ఆమె పోల్ ను ప్రారంభించారు. దీనికి ఇప్పటివరకూ 69,097 మంది ఓట్లు వేయగా, వీరిలో 58 శాతం మంది ఇలా విమర్శించడం సమంజసం కాదని పేర్కొనగా, 42 శాతం మంది ముస్లింలకు సాయం చేయవద్దన్న అర్థం వచ్చేలా 'యస్' అన్న ఆప్షన్ ను ఎంచుకున్నారు.

కాగా, తన భార్య సుష్మాకు సర్దిచెప్పాలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ను స్వరాజ్ కౌశల్ తన ట్విట్టర్ ఖాతాలో శనివారం నాడు షేర్ చేశారు. మతాంతర వివాహం చేసుకున్న ఓ జంట పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకోగా, లక్నోలోని పాస్ పోర్టు సేవా కేంద్రంలో పనిచేస్తున్న అధికారి వికాస్ మిశ్రా వారిని దూషించాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సదరు జంట ట్విట్టర్ లో కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయగా, ఆమె స్పందించి, అధికారిని బదిలీ చేసి, వారికి పాస్ పోర్టును ఇప్పించారు. దానిపైనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.

More Telugu News