ambati rambabu: టీడీపీ ఎంపీల వ్యాఖ్యలను చంద్రబాబు సీరియస్ గా తీసుకోవాలి: అంబటి రాంబాబు

  • నిన్న టీడీపీ ఎంపీల మాటలను అందరూ మీడియాలో చూశారు
  • ఢిల్లీలో టీడీపీ ఎంపీల నాటకాలు బయటపడ్డాయి
  • చంద్రబాబు పోరాటాలన్నీ నాటకమే.. ప్రజలు నమ్మొద్దు

'బరువు తగ్గాలనుకుంటే నిరాహార దీక్ష చేస్తాను' అంటూ టీడీపీ ఎంపీలు ఓ గదిలో మాట్లాడుకుంటుండగా తీసిన ఓ వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్న టీడీపీ ఎంపీల మాటలను అందరూ మీడియాలో చూశారని, ఢిల్లీలో టీడీపీ ఎంపీల నాటకాలు బయటపడ్డాయని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలకు విభజన హామీలు నెరవేరాలనే చిత్తశుద్ధి లేదని అన్నారు.

టీడీపీ ఎంపీలు చేసిన ఈ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకుని, వారికి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ ఎంపీలు చిత్తశుద్ధితో తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తమ ఎంపీలు పోరాడుతుంటే, టీడీపీ నేతలు అవహేళన చేశారని మండిపడ్డారు. టీడీపీ నేతలు రాజీనామాలు చేయరు కానీ, విచిత్రంగా దీక్షలు చేస్తారని విమర్శించారు. లాలూచీ రాజకీయాలు చేసే చంద్రబాబు దీక్షలతో ఒరిగేదేమీ ఉండదని, బీజేపీతో పోరాడుతున్నట్టు చంద్రబాబు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు పోరాటాలన్నీ నాటకమని, ఆ పోరాటాలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. వైఎస్ జగన్ ని విమర్శించడమే చంద్రబాబు నైజమని, తమ పార్టీని విమర్శించేందుకే ‘ఏరువాక’ కార్యక్రమాన్ని టీడీపీ వాడుకుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయాభివృద్ధి మైనస్ లో ఉందని, వ్యవసాయంపై ఆయనకు ఎంతమాత్రం ప్రేమ లేదని, వ్యవసాయ వ్యతిరేక ముఖ్యమంత్రి అని, కమీషన్ వచ్చే రంగాలపైనే ఆయన దృష్టి పెడతారని విమర్శించారు.  

More Telugu News