Vijay mallya: మాల్యా ఉన్నట్టుండి ఇప్పుడు నోరెందుకు విప్పినట్టు? కాళ్ల బేరానికి కారణం ఏమిటి?

  • తన ఆస్తులను అమ్మి బకాయిలు చెల్లిస్తానన్న మాల్యా
  • ఆ బాధ్యత తనపై ఉందని ప్రకటన
  • ముప్పు నుంచి తప్పించుకునేందుకే కాళ్ల బేరం

భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌లో దర్జాగా తిరుగుతున్న మాల్యా అకస్మాత్తుగా నోరు విప్పారు. రెండేళ్ల మౌనాన్ని ఛేదిస్తూ తనపై వచ్చిన ఆరోపణల వెనక ఉన్న అసలు నిజాలను వెల్లడించాల్సిన బాధ్యత తనపై ఉందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆస్తులు విక్రయించి రుణాలను చెల్లించేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ కర్ణాటక హైకోర్టును కోరారు. రెండేళ్ల పాటు ఒక్క మాటా మాట్లాడని మాల్యా ఇప్పుడు అకస్మాత్తుగా ఇంత పెద్ద ప్రకటన విడుదల చేయడం వెనక ఉన్న కారణంపై విశ్లేషకులు చెబుతున్నది ఇదీ..

విశ్లేషకులు చెబుతున్న దానిని బట్టి మాల్యా తొలుత భయపడుతున్నది చట్టాల గురించి. ప్రస్తుత పరిణామాలు, కఠినంగా మారుతున్న చట్టాల కారణంగానే ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. ఇంకా మౌనంగా ఉంటూ, తప్పించుకోవాలని చూస్తే మొదటికే మోసం వచ్చే పరిస్థితి వస్తుందనేది మాల్యా భావన. గతేడాది ప్రభుత్వం దివాలా చట్టంలో పలు సవరణలు చేసి మరింత కఠినంగా మార్చింది. ఫలితంగా ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసే వారికి చుక్కలు చూపించనుంది.

అదే సమయంలో బినామీ లావాదేవీల చట్టం కూడా అమల్లోకి వచ్చింది. ఇటీవల విజయ్ మాల్యాను ప్రభుత్వం పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడుగా పేర్కొంది. అతడి పాస్ పోర్టు కూడా రద్దయింది. ఇలా తనపై మూకుమ్మడి దాడి జరుగుతుండడంతో మరో మార్గం లేక ఆయన కాళ్ల బేరానికి వచ్చినట్టు చెబుతున్నారు. తనకున్న రూ. 13,900కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం ద్వారా బకాయిలు చెల్లించే అవకాశం ఇవ్వాలని ప్రాథేయపడుతున్నారు.

More Telugu News