kcr: పని చేయాలన్న ఉద్దేశంతోనే దానం మా పార్టీలో చేరారు: సీఎం కేసీఆర్

  • ‘తెలంగాణ’ ఏర్పాటు ఒక చరిత్ర.. పునర్నిర్మాణం మరో చరిత్ర
  • చిత్తశుద్ధితో పని చేస్తే ఫలితాలు సుసాధ్యం
  • మానవీయ కోణంలోనే సంక్షేమ పథకాల రూపకల్పన చేశాం

దానం నాగేందర్ కు, ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అనంతరం, కేసీఆర్ మాట్లాడుతూ,అందరి అభిమానంతో టీఆర్ఎస్ లో చేరిన దానం సహా అనుచరులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానని అన్నారు. దానం టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు తనకు నిన్ననే చెప్పారని,దానం టీఆర్ఎస్ లో చేరడమంటే సుఖపడటం కోసం కాదని, కష్టపడటం కోసమేనని, పని చేయాలన్న ఉద్దేశంతోనే దానం తమ పార్టీలో చేరారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక చరిత్ర, పునర్నిర్మాణం జరగడం మరో చరిత్ర అని, రాష్ట్ర పునర్నిర్మాణం టీఆర్ఎస్ కు ఓ పవిత్ర యజ్ఞంతో సమానమని అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో శత్రువులు ఎంత అడ్డుపడ్డా ఎదుర్కొని ముందుకెళ్లామని, అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే పెన్షన్లు ఇచ్చామని అన్నారు.

సమాజంలోని బాధ, ఆవేదన, ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఓట్ల కోసం కాదని, పక్షపాత ధోరణి లేకుండా, మానవీయ కోణంలోనే సంక్షేమ పథకాల రూపకల్పన చేశామని చెప్పారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఫలితాలు సుసాధ్యమని, అందుకు నిదర్శనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడమేనని అన్నారు. 90 శాతం పేదలు ఉన్న రాష్టం తెలంగాణ అని, పక్షపాత ధోరణి రూపు మాపేందుకు పథకాల లబ్ధిదారుల ఎంపికను అధికారుల చేతిలోనే పెట్టామని, లబ్ధిదారుల ఎంపికలో టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ అనే భేదం చూపలేదని అన్నారు.

More Telugu News