Jammu And Kashmir: డిఫెండ్, డిస్ట్రాయ్, డిఫీట్, డినై... ఉగ్రవాదుల కోసం సైన్యం '4డీ' ప్లాన్!

  • గవర్నర్ పాలన వచ్చిన తరువాత మారిన వ్యూహం
  • రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
  • పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం

ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది.   అక్కడి పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పడిపోయి, గవర్నర్ పాలన వచ్చిన తరువాత, ఉగ్రవాదుల ఏరివేతను పెద్దఎత్తున చేబట్టింది. ఈ క్రమంలో కేంద్ర హోమ్ శాఖ '4డీ' వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

డిఫెండ్‌’ (రక్షించు), డిస్ట్రాయ్‌ (నాశనం చేయు) డిఫీట్‌ (ఓడించు), డినై (నిరాకరించు) విధానాన్ని కశ్మీర్ లోయలోని సమస్యాత్మక ప్రాంతాల్లో అమలు చేయాలని జవాన్లకు ఆదేశాలు అందాయి. 'డిఫెండ్' కింద జవాన్లు ఉన్న శిబిరాల వద్ద భద్రతను మరింతగా పెంచనున్నారు. 'డిస్ట్రాయ్' కింద ఉగ్రవాదులు తలదాచుకునే షెల్టర్స్ ను గుర్తించి వాటిని నాశనం చేస్తారు. ఇక 'డిఫీట్' కింద వేర్పాటువాద సిద్ధాంతం మరింతగా విస్తరించకుండా ఆణచి వేయాలి. చివరిగా 'డినై' కింద కాశ్మీర్ యువకులు ఉగ్రవాద సంస్థల్లోకి చేరకుండా వారిని అడ్డుకుని ఉపాధిని చూపాలి.

ఇదిలా వుండగా, హురియత్ నాయకులపై మరింత కఠినంగా ఉండాలన్న హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదేశాలతో యాసిన్ మాలిక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, హురియత్ చైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల అంత్యక్రియలు జరిగే సమయంలో యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసే వారిని ఉపేక్షించరాదని, రాళ్లు రువ్వే కేసుల్లో ఇరుకున్న యువతకు క్షమాభిక్ష పెట్టకూడదని కూడా రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి ఒకరు వెల్లడించారు.

More Telugu News