KE krishnamurthy: పవన్.. ఆ ఐపీఎస్ అధికారి ఎవరో చెప్పండి!: కేఈ డిమాండ్

  • ఓ అజ్ఞాతవాసి.. మరో అజ్ఞాతవాసి చెబితే నమ్మేస్తారా?
  • తిరుమల వెంకన్నతో పెట్టుకోవడం మంచిది కాదు
  • బీజేపీ, వైసీపీ తానా అంటే పవన్ తందానా అంటున్నారు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఫైరయ్యారు. అనుభవరాహిత్యంతో పవన్ ఏదోదో మాట్లాడుతున్నారని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఓ అజ్ఞాతవాసి.. మరో అజ్ఞాతవాసి చెప్పిన మాటలు విని ప్రభుత్వంపై అభాండాలు వేయడం సరికాదన్నారు. శ్రీవారి నగలు ప్రత్యేక విమానంలో తరలిపోయాయని తనకు ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని అంటున్న పవన్.. ఆ అధికారి పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. అతనెవరో చెబితే వాస్తవాలు తెలుసుకుంటామని అన్నారు.

ప్రజాక్షేత్రంలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలి తప్ప ప్రజలను తప్పుదారిలోకి తీసుకెళ్లడం సరికాదన్నారు. తిరుమల విషయంలో ఇప్పటి వరకు ఎవరూ ఎటువంటి ఆధారాలు చూపించలేదన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం మాత్రమే జరుగుతోందన్నారు. బీజేపీ, వైసీపీ తానా అంటే.. పవన్ తందానా అంటున్నారని ఎద్దేవా చేశారు.  

తిరుమల వెంకన్న మహిమ గల దేవుడని, ఆయనతో పెట్టుకోవడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ వాద్వా, జస్టిస్‌ జగన్నాథరావు కమిషన్‌లు శ్రీవారి తిరువాభరణాలపై నివేదికలు ఇచ్చాయని.. అవసరమైతే వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని కేఈ స్పష్టం చేశారు.

More Telugu News