Vijayawada: విజయవాడలో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. భార్యాభర్తల అరెస్ట్!

  • జక్కంపూడి కాలనీలో బయటపడిన బాగోతం
  • మహిళలను ట్రాప్ లోకి లాగి వ్యభిచారం
  • పోలీసుల హస్తంపై అనుమానాలు

విజయవాడలో బయటపడిన ఓ సెక్స్ రాకెట్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. జక్కంపూడి కాలనీలో భార్యాభర్తలు కలిసి నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ వ్యవహారం బాధిత మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. గతంలోనే పలువురు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఓ సామాజిక కార్యకర్త ద్వారా బాధిత యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వ్యభిచార ముఠా నిర్వాహకులు శోభారాణి, ఆమె భర్త నారాయణమూర్తి, ఆటో డ్రైవర్‌ సతీష్‌లను అరెస్ట్ చేశారు.

పెయింటింగ్ పనిచేసే వంగర నారాయణమూర్తి, శోభారాణి దంపతులు కాలనీలో నివసిస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వారి వలలో చిక్కుకున్న తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఓ యువతి తన బాధను మొబైల్‌లో రికార్డు చేసి సామాజిక కార్యకర్తకు పంపింది. దీంతో విషయం మీడియాకెక్కింది.

బాధిత మహిళ రికార్డు చేసి పంపిన దాని ప్రకారం.. ఆమె ఇంటర్ వరకు చదువుకుంది. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆమె పెదనాన్న ఆమెకు పెద్ద వయసున్న వ్యక్తితో పెళ్లి చేశాడు. ఇష్టం లేని ఆమె తప్పించుకుని విజయవాడ చేరుకుంది. అక్కడ ఆటోడ్రైవర్ సతీష్ చేతికి చిక్కింది. ఆమెకు పని చూపిస్తానని నమ్మించి తన చెల్లెలు అంటూ శోభారాణి వద్దకు తీసుకెళ్లి బాధిత యువతిని అప్పగించి రూ.10వేలు తీసుకున్నాడు.

ఓ రోజు శోభారాణి బలవంతంగా ఆమెతో వ్యభిచారం చేయించే ప్రయత్నం చేసింది. వదిలేయమని ప్రాధేయపడినా వినిపించుకోలేదు. ఆమెపై చేయిచేసుకుని బలవంతంగా వ్యభిచారం చేయించింది. తనకు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయంటూ బెదిరించింది. ఆ తర్వాత చెన్నై తీసుకెళ్లి పది రోజులు వేరే వారికి అప్పగించి వారి నుంచి రూ.30 వేలు తీసుకుంది. తర్వాత భీమవరం, గుంటూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లింది. గుంటూరులోని కొత్తపేటలో పది నెలలు ఉంచిన తర్వాత ఇటీవల తిరిగి జక్కంపూడి తీసుకొచ్చింది.

శోభారాణి చేతిలో ఎందరో యువతులు చిక్కి విలవిల్లాడారు. పోలీస్ స్టేషన్‌ అంటే తనకు భయం లేదని, రూ.20 వేలు ఇచ్చి బయటపడ్డానని తనతో చెప్పిందని మరో బాధితురాలు తెలిపింది. ఓసారి శోభారాణిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ మహిళను పోలీసులు లోపలేశారు. ఇలా పోలీసులు కూడా ఆమెకు పరోక్షంగా సహకరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఫొటోలు చూపించమని అడిగేవారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఎట్టకేలకు సామాజిక కార్యకర్త చొరవతో శోభారాణి ఆగడాలకు అడ్డుకట్ట పడింది.

More Telugu News