Anushka Sharma: 'చెత్త' గొడవ.. విరాట్ కోహ్లీ, అనుష్కశర్మలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అర్హన్!

  • రోడ్డుపై చెత్త వేసిన అర్హన్ పై మండిపడ్డ అనుష్క
  • వీడియో తీసి పోస్ట్ చేసిన కోహ్లీ
  • నా చెత్త కంటే నీ నోటి నుంచి వచ్చిన చెత్తే ఎక్కువన్న అర్హన్

రోడ్డుపై ప్లాస్టిక్ సీసాను పడేసిన ఓ వ్యక్తిపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం ఘటనను చిత్రీకరించిన ఆమె భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు, ఇలాంటి వాళ్లు ఎదురైతే మీరు కూడా అనుష్కలాగానే చేయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఈ అంశంపై బాటిల్ పడేసిన అర్హన్ సింగ్ స్పందించాడు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఇన్ స్టాగ్రామ్ ద్వారా దీటైన సమాధానం చెప్పాడు. "అనుష్క, నీకు మర్యాద అంటే ఏమిటో కూడా తెలియదు. నా కారులో నుంచి పడిన చెత్త కంటే నీ నోటి నుంచి వచ్చిన చెత్తే ఎక్కువ. నీ భర్త కోహ్లీ బుర్ర కూడా చెత్తే. ఈ పోస్ట్ ద్వారా మీలా నేను ప్రచారం పొందాలని అనుకోవడం లేదు. జరిగిన ఘటన చాలా భయానకం. పొరపాటున ఓ మిల్లీ మీటరు చెత్తను నిర్లక్ష్యంగా రోడ్డుపై పడేశా. కారులో నుంచి వెళ్తూ చూస్తే, అద్భుతమైన అనుష్క కనిపించింది. అంతలోనే, పిచ్చెక్కిన రోడ్ సైడ్ వ్యక్తిలా అరిచింది. చేసిన తప్పుకు నేను పశ్చాత్తాప పడుతున్నా. కానీ, నీ మాటల్లో కొంచెం మర్యాద, సంప్రదాయం ఉంటే బాగుంటుంది. మర్యాదగా ఉండటం వల్ల నీ స్టార్ ఇమేజ్ తగ్గదు. సభ్యత, సంస్కారం చాలా విధాలుగా ఉంటుంది. అందులో మాట తీరు కూడా ఒక్కటి.

నా లగ్జరీ కారు కిటికీ నుంచి పొరపాటుగా పడిన చెత్త.. నీ నోటి నుంచి వచ్చిన చెత్త, లేదా నీ లగ్జరీ కారు కిటికీలోంచి దాన్ని చిత్రీకరించి, ఆన్ లైన్ లో పోస్ట్ చేసిన నీ భర్త కోహ్లీ పనికిమాలిన బుర్ర నుంచి వచ్చిన చెత్త కన్నా చాలా తక్కువ. మీరు ఈ పనిని ఏ ప్రయోజనం కోసం చేసినా... ఇప్పుడు ఇది మరింత తీవ్రమైన చెత్తగా మారింది" అంటూ ఘాటుగా స్పందించాడు.

అర్హన్ సింగ్ కు ఆయన సోదరి కూడా మద్దతుగా నిలిచారు. "మా అన్నయ్యతో నీవు మాట్లాడిన మాటలు చెత్త కాదా?" అంటూ మండిపడ్డారు. ఏం మనుషులు మీరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News