kumara swamy: కావేరీ వివాదం త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉంది: కర్ణాటక సీఎం కుమారస్వామి

  • ఇకపై అంతా సవ్యంగానే జరుగుతుంది
  • ప్రస్తుతం కర్ణాటకలోని డ్యామ్ లలో ఇన్ ఫ్లో పెరిగింది
  • జూన్ చివరి నాటికి తమిళనాడుకు 10 టీఎంసీలు విడుదల చేస్తాం

కావేరీ నదీ జలాల వివాదం త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉందని కర్ణాటక సీఎం కుమారస్వామి గౌడ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయమై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం లభిస్తుందని అన్నారు. కాబినీ డ్యామ్ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందిగా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించానని, తద్వారా రెండు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

ప్రస్తుతం కర్ణాటకలోని డ్యామ్ లలో ఇన్ ఫ్లో పెరిగిందని, ఇకపై కావేరి జలాల పంపకం విషయంలో అంతా సవ్యంగానే జరుగుతుందని చెప్పారు. వాతావరణం అనుకూలించి, సరైన సమయంలో వర్షాలు కురిస్తే.. కావేరీ జలాల యాజమాన్య సంస్థ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ చివరి నాటికి తమిళనాడుకు 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు.

కాగా, కాబినీ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాలన్న కుమారస్వామి నిర్ణయంపై మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ స్పందించారు. కుమారస్వామి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాల ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవుతాయని కమల్ అభిప్రాయపడ్డారు.

More Telugu News