ram gopal varma: నా నెక్స్ట్ సినిమా ‘వైరస్’: రామ్ గోపాల్ వర్మ

  • పరాగ్ సంఘ్వీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
  • మానవీయ కోణంలో తెరకెక్కించనున్న సినిమా ఇది
  • ప్రజలు - ప్రభుత్వం ఎలా సతమతమయ్యారనే నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాం

ఇటీవలే ‘ఆఫీసర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి సినిమా ప్రకటించారు. ‘నా నెక్ట్స్ సినిమా ‘వైరస్’. సర్కార్, ఎటాక్స్ ఆఫ్ 26/11 చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన పరాగ్ సంఘ్వీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..’ అని వర్మ తన ట్వీట్ లో చెప్పారు. ‘వైరస్’ గురించిన వివరాలు తెలియజేస్తూ ఓ లింక్ ను వర్మ జతపరిచారు.

‘ఓ విద్యార్థి  మధ్య ఆఫ్రికాకు వెళతాడు. అక్కడి నుంచి తిరిగి ముంబై వచ్చాక ఓ భయంకరమైన వ్యాధితో అతను బాధపడుతుంటాడు. ఈ వ్యాధి ముంబై నగరం అంతటా దావానలంలా వ్యాపిస్తుంది. తక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా లేని ప్రభుత్వం.. రెండు కోట్ల మంది జనాభా ఉన్న ముంబైలో ఒకరి నుంచి మరొకరి మధ్య కనీసం 20 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలంటూ ఆచరణ సాధ్యం కాని విధంగా ప్రజలను హెచ్చరిస్తుంది... ఆ వ్యాధి నుంచి బయటపడలేక ప్రజలు, వారిని కాపాడుకోలేక ప్రభుత్వం ఎలా సతమతమైందనే నేపథ్యంలో ఈ సినిమా తీయబోతున్నాం. భయం, బాధ, ప్రేమ, త్యాగం, ఆశ నిరాశలను జోడించి మానవీయ కోణంలో తెరకెక్కించనున్నాం’ అని వర్మ పేర్కొన్నారు.

కాగా, ‘ఎబోలా కంటే భయంకరమైన వైరస్ ఇది. గత నలభై ఏళ్లలో దాదాపు పది అంతుబట్టని వైరస్ లు ముంబైని కుదిపేశాయి. ఇలాంటి మహానగరంలో ఎబోలా కన్నా ప్రమాదకరమైన వైరస్ వ్యాపిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ప్రపంచంలోని బయోసైంటిస్టులు కంగారుపడుతున్నారు. ఈ వైరస్ గురించి క్షేత్ర స్థాయిలో పరిశోధనలు చేసి వర్మ ఈ సినిమా తీయబోతున్నారు. నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అని పరాగ్ సంఘ్వీ పేర్కొన్నారు.

More Telugu News