Telangana: ఎన్ఎస్పీ లిఫ్ట్ ఇరిగేషన్ పై అధికారులకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు కీలక సూచనలు

  • ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు సమస్యల పరిష్కారంపై ఆదేశాలు
  • సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు పనులు
  • దున్నపోతుల గండి, కేశవాపురం ఇరిగేషన్ స్కీమ్‌లపై సమీక్ష

హైదరాబాద్‌లోని జల సౌధలో ఎన్ఎస్పీ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ హైలెవల్ కెనాల్ 8, 9 లో 23 కిలోమీటర్ల తరువాత దాదాపు ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని అధికారులు ఈ సమీక్షలో మంత్రి హరీశ్ రావుకు తెలిపారు. చలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2 వేల ఎకరాల ఆయకట్టుకు డీప్ కట్ ఉండడం వల్ల నీటి పంపింగ్ లో అంతరాయం కలుగుతోందని వివరించారు.

దీన్ని అధిగమించేందుకు లో లెవల్ కెనాల్ పంప్ హౌస్ లోని మూడు పంపుల్లో... ప్రత్యామ్నాయంగా ( స్టాండ్ బై) ఉన్న పంపు ఉపయోగించి డీ 8, 9 కు అనుసంధానం చేసేలా ప్రతిపాదనలు పంపాలని మంత్రి హరీశ్‌ రావు అధికారులను ఆదేశించారు. ఎన్ఎస్పీ పుట్టంగండి నుంచి అక్కంపెల్లి బాలెన్సింగ్ రిజర్వాయర్ కు గల 9.3 కిలోమీటర్ల లింక్ కెనాల్, అక్కడి నుంచి కోదండాపూర్ రిజర్వాయర్ వరకు గల 2 కిలోమీటర్ల వరకు నిరంతరం హైదరాబాద్ కు పంపింగ్ స్కీమ్‌ ద్వారా తాగు నీరు అందిస్తున్నారని.. ఇది నిరంతరం జరగడం వల్ల కెనాల్ కోతకు గురవుతుందని అధికారులు మంత్రికి తెలిపారు.

కెనాల్ వెంబడి ఉన్న రోడ్డు కోతకు గురయి తరచు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని మంత్రి హరీశ్ రావు దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు లైనింగ్ పనులు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో పాటు ఎఎమ్ఆర్పీ కెనాల్ లైనింగ్ ఉదయ సముద్రం కింది వరకు ఉండేలా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించారు.

మిర్యాల గూడ నియోజకవర్గంలోని దున్నపోతుల గండి, నూతన పాలెం, కేశవాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లకు సంబంధించి టెయిల్ ఎండ్ ఆయకట్టును స్థిరీకరించే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ట్రైబల్ సబ్ ప్లాన్ కింద పనులు చేసే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. దిండి ఎత్తిపోతల పథకంలో భాగమయిన గొట్టిముక్కల రిజర్వాయర్ ద్వారా తొలి ఫలాలు రైతులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆర్అండ్ఆర్ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని, కాలువల పనులను అక్టోబర్ - నవంబర్ లోగా పూర్తి చేసేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

More Telugu News