FIEO: రూ. 20 వేల కోట్ల జీఎస్టీ రిఫండ్స్ ను పెండింగ్ లో పెట్టిన మోదీ సర్కారు: ఫియో సంచలన రిపోర్ట్

  • రిఫండ్స్ కోసం వేచి చూస్తున్న ఎగుమతిదారులు
  • 2018-19లో 350 బిలియన్ డాలర్లకు ఎక్స్ పోర్ట్స్
  • అంచనా వేసిన ఫియో అధ్యక్షుడు గణేష్ కుమార్ గుప్తా

ఇండియాలోని ఎగుమతిదారులు గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) రిఫండ్స్ కోసం వేచి చూస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం రూ. 20 వేల కోట్లకు పైగా రిఫండ్స్ ను పెండింగ్ లో పెట్టిందని ఫియో (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్స్ ఆర్గనైజేషన్) తన రిపోర్టులో వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 50 బిలియన్ డాలర్లు అదనంగా 350 బిలియన్ డాలర్లకు భారత ఎగుమతులు పెరగనున్నాయని అంచనా వేసింది.

గత సంవత్సరం కంటే, ఈ సంవత్సరం 15 నుంచి 20 శాతం మేరకు ఎగుమతులు పెరుగుతాయని ఆంచనా వేస్తున్నట్టు వెల్లడించిన ఫియో అధ్యక్షుడు గణేష్ కుమార్ గుప్తా, ఎగుమతిదారులు జీఎస్టీ రిఫండ్స్ కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం ఎగుమతుల వృద్ధి గణనీయంగా పెరగడానికి ఓ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో రూపాయి విలువ బలహీనపడటం కూడా ఎగుమతి విలువను పెంచిందని ఆయన వ్యాఖ్యానించారు.

జెమ్స్ అండ్ జ్యూయెలరీ, లెదర్, అపెరల్, హ్యాండీక్రాఫ్ట్స్ విభాగాల్లో ఏప్రిల్ వరకూ తగ్గిన ఎగుమతులు, ఆపై పుంజుకున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ప్రతి ఆరున్నర కోట్ల విలువైన ఎగుమతులు దేశంలో 100 మందికి ఉపాధిని కల్పిస్తున్నాయని, సమీప భవిష్యత్తులో పెరిగే ఎగుమతులు 27 లక్షల మందికి ఉద్యోగావకాశాలను దగ్గర చేయనున్నాయని పేర్కొంది. జీఎస్టీ వచ్చిన 10 నెలల తరువాత ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పెండింగ్ లో ఉన్నాయని, సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ రిఫండ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోందని గుప్తా ఆరోపించారు.

మార్చి నెలలో రూ. 7 వేల కోట్ల రిఫండ్స్ ఇచ్చిన కేంద్రం ఆపై ఏప్రిల్ లో 1000 కోట్లను మాత్రమే వెనక్కు ఇచ్చిందని తెలిపారు. మొత్తం ఇన్ పుట్ క్రెడిట్ టాక్స్ రూ. 13 వేల కోట్లను దాటేసిందని ఫియో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత త్వరగా రిఫండ్స్ ప్రారంభించాలని కోరుతున్నామని తెలిపారు. ఎగుమతిదారులకు చెల్లించేందుకు తమ వద్ద సరిపడినన్ని నిధులు లేవని ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

More Telugu News