టీడీపీ మహానాడు చరిత్రలో ఇదో రికార్డు: లోకేష్

30-05-2018 Wed 08:29
  • నిన్నటితో ముగిసిన మహానాడు
  • 43 వేల మంది ప్రతినిధుల హాజరు
  • ఇంతమంది వచ్చినా ఇబ్బందులు కలుగలేదు
  • మీడియాతో నారా లోకేష్

నిన్నటితో ముగిసిన తెలుగుదేశం పార్టీ మహానాడుకు 43 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారని ఏపీ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. టీడీపీ చరిత్రలో మహానాడుకు ఇంతమంది హాజరుకావడం ఓ రికార్డని తెలిపారు. గత సంవత్సరం విశాఖపట్నంలో జరిగిన మహానాడుతో పోలిస్తే 33 శాతం అధికంగా ప్రతినిధుల నమోదును కళ్ల జూశామని అన్నారు.

మహానాడు ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, వేలమంది వచ్చినప్పటికీ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూశామని, ఒక్క టీడీపీకే ఇంత క్రమశిక్షణతో కూడిన కార్యకర్తల బలముందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన బీజేపీ తమ ప్రథమ శత్రువని, ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తోందని లోకేష్ విమర్శలు గుప్పించారు.