IPL: రెండు రకాల సెంటిమెంట్లు... ఓ రకంగా చెన్నై, మరో రకంగా హైదరాబాద్... ఐపీఎల్ లెక్క తేలేది నేడే!

  • నేడు ఐపీఎల్ ఫైనల్ పోరు
  • హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య పోటీ
  • ముంబైలోని వాంఖడే స్టేడియంలో పోరు

'పులి, పులి పోట్లాడితే పులే గెలుస్తుంది' ఇది ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీలకు ముందు టీవీ చానళ్లలో వచ్చిన ప్రోమోలోని ఓ వ్యాఖ్య. నిజమే... ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీల్లో రెండు పులులే పోట్లాడుతున్నాయి. లీగ్ దశలో టాప్ 2 స్థానాల్లోని హైదరాబాద్ సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు నేడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ ని ఆడనున్నాయి. ఇక్కడ రెండు రకాల సెంటిమెంట్ లు. ఒక సెంటిమెంట్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలుస్తుందని అభిమానులు అంచనా వేస్తుంటే, మరో సెంటిమెంట్ ను చూపిస్తూ, సన్ రైజర్స్ గెలుస్తుందని అంటున్నారు. ఆ లెక్కలేంటంటే...

గత సంవత్సరం పోటీలను ఓమారు గుర్తు చేసుకోండి. మహేంద్ర సింగ్ ధోనీ, స్టీవ్ స్మిత్ తదితర ఆటగాళ్ల బలంతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు, లీగ్ దశలో రెండు మ్యాచ్ లతో పాటు, క్వాలిఫయర్-1 పోటీలోనూ ముంబై జట్టును ఓడించింది. ఆపై ముంబై జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్ విజేత కోల్ కతా నైట్ రైడర్స్ పై క్వాలిఫయర్-2 పోటీలో గెలిచి ఫైనల్స్ కు వచ్చింది. టైటిల్ ఎగరేసుకు పోయింది. ఈ విధంగా చూస్తే, ఈ సంవత్సరం చెన్నై చేతిలో తానాడిన మూడు మ్యాచ్ లనూ ఓడిపోయిన హైదరాబాద్ జట్టు, ఫైనల్స్ లో చెన్నైపై విజయం సాధించి పగ తీర్చుకుంటుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక రెండో లెక్క ఏంటంటే, ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఢిల్లీ జట్టు నిలిచినప్పుడెల్లా, రెండో స్థానంలో ఉన్న జట్టు కప్పును ఎగరేసుకుపోయింది. 2011లో చెన్నై, 2013లో ముంబై, 2014లో కోల్ కతా జట్లు టైటిల్ కొట్టగా, ఆ సంవత్సరాల్లో ఢిల్లీ చివరి స్థానంలో ఉంది. ఈ లెక్క ప్రకారం కప్పు ఈ సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ కు రావాలి. ఎవరి లెక్కలు వారివే అయినా, నేటి పోటీ రెండు పులుల మధ్య పోటీయేననడంలో సందేహం లేదు.

More Telugu News