modi: ముప్పై ఒక్క ఏళ్ల తర్వాత కటక్ లో పర్యటించనున్న భారత ప్రధాని!

  • ఈ నెల 26న కటక్ లో పర్యటించనున్న పీఎం
  • నెహ్రూ, ఇందిర, రాజీవ్ ల తర్వాత పర్యటిస్తున్న ప్రధాని మోదీ
  • భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్

గత ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల తర్వాత ఒడిశాలోని కటక్ లో పర్యటించనున్న మొట్టమొదటి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించనున్నారు. ఈ నెల 26న కటక్ లోని బాలిజాతన మైదానంలో నిర్వహించే ఓ బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ నలభై ఎనిమిదేళ్ల పాలన - కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ నలభై ఎనిమిది నెలల పాలనపై ఈ సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు.

ఈ నెల 26న భువనేశ్వర్ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ లో కటక్ లోని నరాజ్ ప్రాంతంలో ఉన్న హెలిప్యాడ్ కు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్టు సమాచారం. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఇదిలా ఉండగా, ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత కటక్ లో పర్యటిస్తున్న మొదటి ప్రధానమంత్రి మోదీ అని చెప్పొచ్చు. ఎందుకంటే, మనదేశ తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కటక్ లో రెండుసార్లు పర్యటించారు. స్థానిక రెవెన్షా కళాశాల ఆవరణలో జరిగిన 49వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో, 1951లో డిసెంబరు 14న బాలిజాతర మైదానంలో జరిగిన ఓ బహిరంగ సభకు నెహ్రూ హాజరై ప్రసంగించారు.

ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కటక్ లోని బాలిజాతర మైదానంలో నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. 1987లో ఇండోర్ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల్లో ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ పాల్గొన్నారు. ఆ తర్వాత మన ప్రధానమంత్రులెవ్వరూ అక్కడ పర్యటించకపోవడం గమనార్హం.

More Telugu News