Andhra Pradesh: ఏపీలో 10 ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణానికి కేంద్రం అంగీకారం: మంత్రి పితాని

  • కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ ను కలిశాను
  • ఆసుపత్రుల స్థాయి పెంపుదలకు సూత్రప్రాయంగా అంగీకరించారు
  • రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు

రాష్ట్రంలో పది ఈఎస్ ఐ ఆసుపత్రులకు నూతన భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టు ఏపీ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ను, ఉన్నతాధికారులను ఢిల్లీలో ఈరోజు కలిసి చర్చించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రుల స్థాయి పెంపుదలకు, తిరుపతిలో నిర్మాణం పూర్తయిన ఈఎస్ఐ ఆసుపత్రి భవనాలను జూన్ 2వ పక్షంలో ప్రారంభోత్సవానికి విచ్చేయడానికి సంతోష్ కుమార్ గంగ్వార్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెప్పారు.  

అమరావతి, విశాఖపట్నంలలో సూపర్ స్పెషాలిటి ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం కొరకు ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని కోరగా రాష్ట్ర, కేంద్ర ఉన్నతాధికారుల బృందం ఆయా ప్రాంతాలను పరిశీలించి వారి సూచనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వడానికి కేంద్ర మంత్రి తమ అంగీకారం తెలిపినట్టు చెప్పారు. గుంటూరులో 100 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి అంగీకరిస్తూ అనుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారని అన్నారు.

విజయనగరం, రాజమండ్రిలలోని ఆసుపత్రుల స్థాయి పెంపుదల చేసి అక్కడి అవసరాలకు అనుగుణంగా అనుమతులిస్తామని చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈఎస్ ఐ ఆసుపత్రుల నిర్మాణం, ఆసుపత్రుల స్థాయి పెంపుదల, కార్మికుల సంక్షేమం, బీమా సౌకర్యం వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో తిరుపతిలో రీజినల్ స్థాయి సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని సంతోష్ కుమార్ గంగ్వార్ హామీ ఇచ్చినట్లు పితాని పేర్కొన్నారు.

More Telugu News