Chandrababu: భారతీయ సంస్కారాన్ని కూడా తప్పుబడతారా?: వైసీపీ, బీజేపీలపై యనమల ఫైర్

  • చంద్రబాబు, రాహుల్ ల కరచాలనంపై వైసీపీ, బీజేపీల విమర్శలు
  • ఇద్దరు వ్యక్తులు ఎదురైనప్పుడు మాట్లాడుకోవడం సంస్కారమన్న యనమల
  • చంద్రబాబును ప్రజలకు దూరం చేయాలనే కుట్ర జరుగుతోందంటూ మండిపాటు

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి నిన్న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హేమాహేమీలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు కరచాలనం చేసుకోవడం, రాహుల్ భుజాన్ని చంద్రబాబు తట్టడం వంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. దీనిపై వైసీపీ, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య ఏదో జరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల ఫైర్ అయ్యారు. కుమారస్వామి ఆహ్వానం మేరకే చంద్రబాబు బెంగుళూరుకు వెళ్లారని, కాంగ్రెస్ పార్టీ పిలిస్తే వెళ్లలేదని అన్నారు.

ఇద్దరు వ్యక్తులు ఎదురైనప్పుడు అభినందించుకోవడం, మాట్లాడుకోవడం సంస్కారమని... భారతీయ సంస్కారాలను కూడా తప్పుబడుతున్నారంటూ యనమల మండిపడ్డారు. కర్ణాటకలో జాతీయగీతం ఆలపిస్తుంటే యడ్యూరప్ప వెళ్లిపోయారని... ఇదేం సంస్కారమని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రజలకు దూరం చేసేందుకు వైసీపీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని యనమల ఆరోపించారు. కేసుల మాఫీ కోసం బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడం జగన్ సంస్కృతి అని ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై బెంగుళూరులో ఇతర పార్టీల అధినేతలతో చంద్రబాబు చర్చించారని... ఈ చర్చల్లో కాంగ్రెస్ పాల్గొనలేదని చెప్పారు.

More Telugu News