Telangana: అనుమానమొస్తే పోలీసులకు చెప్పండి.. ఎవరిపైనా దాడులు చేయద్దు!: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

  • రాత్రి సమయంలో కనబడే వ్యక్తులపై గస్తీ కాసే యువత దాడులు చేయొద్దు
  • చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు
  • ఎవరూ భయపడాల్సిన పని లేదు
  • సోషల్ మీడియాలో ఎవరూ అసత్యాలు ప్రచారం చేయకూడదు 

గ్రామాల్లో కర్రలతో గస్తీ కాస్తున్న యువకులు రాత్రి సమయంలో కనబడే వ్యక్తులపై దాడి చేయడం సరికాదని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ఎవరిపైనైనా అనుమానమొస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలే తప్ప, దొంగలంటూ వారిపై దాడులు చేయొద్దని సూచించారు.

ఎవరూ భయపడాల్సిన పని లేదని పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను మీడియాకు ఆయన వివరించారు. సోషల్ మీడియాలో ఎవరూ అసత్యాలు ప్రచారం చేయొద్దని, కిడ్నాపింగ్ గ్యాంగ్ లు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోందని అన్నారు. తెలంగాణలో ఇలాంటి గ్యాంగ్ లు, ముఠాలు తిరగడం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వదంతుల వల్ల తెలంగాణలో ఇద్దరు అమాయకులు చనిపోయారని అన్నారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News