MS Dhoni: ఐపీఎల్ ఇక ఆడబోనేమో!: అభిమానులకు షాకిస్తున్న ధోనీ వ్యాఖ్యలు

  • చెన్నై జట్టును ప్లే ఆఫ్ కు చేర్చిన ధోనీ
  • ఇప్పటికే సుదీర్ఘ క్రికెట్ ను ఆడిన ఘనత 
  • భవిష్యత్తులో చెన్నై జట్టు మెంటార్ గా వ్యవహరించే యోచన

మహేంద్ర సింగ్ ధోనీ... 36 సంవత్సరాల వయసులోనూ ఉత్సాహంగా క్రికెట్ ఆడుతూ, తన సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజయవంతంగా ప్లే ఆఫ్ దశకు చేర్చి టైటిల్ సాధించే సత్తా ఉన్న జట్లలో ఒకటని నిరూపించాడు. ఎన్నో సంవత్సరాల పాటు సుదీర్ఘ క్రికెట్ ఆడిన ధోనీ, ఇప్పటికే టెస్టులు, వన్డే క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నోటి వెంట అభిమానులకు షాకిచ్చే వ్యాఖ్యలు వచ్చాయి. తాను ఐపీఎల్ క్రికెట్ నుంచి కూడా రిటైర్ మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు ధోనీ వెల్లడించాడు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, చెన్నై జట్టులోని ఎంతోమంది సీనియర్ ఆటగాళ్లు వచ్చే రెండు సంవత్సరాల్లో క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించనున్నారని, వారందరికీ గత పదేళ్ల ఐపీఎల్ ప్రయాణం మధురానుభూతులను మిగిల్చిందనే భావిస్తున్నానని చెప్పాడు. చెన్నై జట్టు యాజమాన్యం ఎంతో తెలివైనదని, వారు ఆటగాళ్ల మనసులకు దగ్గరయ్యారని వ్యాఖ్యానించాడు. వారు ప్రతి సంవత్సరమూ కొత్త ఆటగాళ్లను తీసుకొస్తూనే ఉన్నారని చెప్పాడు.

కాగా, ధోనీ నాయకత్వంలో చెన్నై టీమ్, ఇప్పటివరకూ రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల పాటు చెన్నై జట్టు ఐపీఎల్ కు దూరమై, ఈ సంవత్సరమే తిరిగి బరిలోకి దిగి సత్తా చాటింది. వయసు మీద పడిన దృష్ట్యా, భవిష్యత్తులో చెన్నై ఫ్రాంచైజీకి మెంటార్ గా వ్యవహరిస్తూ సాగాలన్నది ధోనీ అభిమతంగా తెలుస్తోంది.

More Telugu News