petrol: పెట్రోలు ధరలను రికార్డు స్థాయిలో పెంచిన ప్రభుత్వంగా మోదీ సర్కారు చరిత్రకెక్కింది: రఘువీరారెడ్డి

  • పెట్రోల్, డీజిల్‌లపై ఏటా 2 లక్షల కోట్లు రాబడుతోంది
  • ఎన్నికల ముందు పెట్రోలు ధరలను తగ్గిస్తామన్నారు
  • ప్రజలను దగా చేశారు
  • డీజిల్‌, పెట్రోల్ ధరలను తక్షణమే తగ్గించాలి

పెట్రోలు, డీజిల్ ధరలను రికార్డు స్థాయిలో పెంచిన ప్రభుత్వంగా మోదీ సర్కారు చరిత్రకెక్కిందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి అన్నారు. ఈ మేర‌కు విజయవాడలోని ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పెట్రోల్, డీజిల్‌లపై ఏటా 2 లక్షల కోట్ల ఆదాయాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలనుంచి తీసుకుంటోందని అన్నారు. 2014 కి ముందు అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలపై భారం పడకుండా నాటి యూపీఏ ప్రభుత్వం తక్కువ ధరలకు పెట్రోల్, డీజిల్ ఇచ్చిందని చెప్పారు.

మరోవైపు ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు సగానికి తగ్గినా ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన చరిత్ర మోదీదని రఘువీరారెడ్డి అన్నారు. 2014 ఎన్నికల ముందు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చిన మోదీ.. ప్రజలని దగా చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్‌, పెట్రోలు ధరలను తక్షణమే తగ్గించాలని, అంతర్జాతీయ ధరలకనుగుణంగా డీజిల్‌, పెట్రోలు రేట్లను స్థిరీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్కారు కూడా చమురుపై పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు.    

More Telugu News