kpcc: కర్ణాటకలో కీలకపాత్ర పోషించిన డీకే శివకుమార్ కు పీసీసీ అధ్యక్ష పదవి?

  • బీజేపీ అధికారంలోకి రాకుండా విజయవంతంగా అడ్డుకున్న డీకే శివకుమార్
  • డీకేను ప్రత్యేకంగా అభినందించిన కాంగ్రెస్ అధిష్ఠానం
  • మంత్రి పదవితో పాటు కేపీసీసీ బాధ్యతలు 

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో, ఆయనను సముచితంగా గౌరవించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవిని ఇవ్వడంతో పాటు, కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. బలపరీక్షను నెగ్గేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తున్న సమయంలో... డీకే అన్నీ తానై చక్రం తిప్పారు. బీజేపీ కనుసన్నల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సైతం ఆయన బయటకు రప్పించారు.

దీంతో, ఆయనను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేకంగా అభినందించినట్టు సమాచారం. ఈ క్రమంలో 2019లో పార్లమెంటుకు జరగబోయే ఎన్నికలకు డీకే నాయకత్వంలో కర్ణాటకలో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ కు హోంమంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి దక్కనున్నట్టు సమాచారం. దీంతో, ఖాళీ అవుతున్న పీసీసీ అధ్యక్ష పీఠాన్ని డీకేతో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. పరమేశ్వర్ గత రెండు పర్యాయాలుగా కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 

More Telugu News