ఎంపీ సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి!

21-05-2018 Mon 08:23
  • రమేష్ కనిపిస్తే కాల్చివేసే రోజులొస్తాయి
  • ఆయన్ను చెప్పులతో కొట్టి తరిమేస్తారు
  • జమ్మలమడుగు మినీ మహానాడులో ఆది

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ప్రతి అభివృద్ధి పనికీ అడ్డొస్తున్నారని ఆరోపించిన మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన కనిపిస్తే కాల్చివేసే రోజులొస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయానికీ అడ్డుపడుతూ, అనవసరమైన విమర్శలు చేస్తున్న ఆయనను చెప్పులతో కొట్టి తరిమే సమయం రానుందని అన్నారు. తాను తుపాకి వంటి వాడినని, తన కార్యకర్తలు బుల్లెట్‌ లను అందిస్తే, వాటిని కాల్చడమే తన పనని నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన మినీ మహానాడు జరుగగా, మంత్రి పాల్గొని ప్రసంగించారు.

తాను మార్కెట్‌ యార్డులో కూపన్లు అమ్ముకున్నానని కొంతమంది నీచంగా ప్రచారం చేస్తున్నారని, రామసుబ్బారెడ్డిని, ఆయన వర్గీయులను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని చెప్పారు. సీఎం రమేష్ ఇక్కడ కాంట్రాక్టు పనులు చేసుకుంటున్నా, నాయకులు వందల కోట్ల విలువైన పనులు చేసుకుంటున్నా తాను అడ్డుపడలేదని చెప్పిన ఆదినారాయణరెడ్డి, తదుపరి ఎన్నికల్లో తాను జమ్మలమడుగు నుంచి కచ్చితంగా పోటీలో ఉంటానని, చంద్రబాబు తనకే టికెట్‌ ఇస్తారన్న నమ్మకం ఉందని అన్నారు.